ఇంగ్లండ్ కోసం అశ్వినాస్త్రం!
కొత్త రకం ‘బంతి’ కోసం ప్రయత్నిస్తున్న అశ్విన్
స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్
జిమ్‌లో రోజుకు నాలుగు గంటలు
రవిచంద్రన్ అశ్విన్... ప్రస్తుతం భారత క్రికెట్‌లో బౌలింగ్ బాధ్యతలను ఒంటిచేత్తో మోస్తూ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్న స్టార్. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో 27 వికెట్లు తీసిన అశ్విన్... ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు తను అలసట లేకుండా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో విశ్రాంతి ఇచ్చారు. కానీ అశ్విన్ ఇంటి దగ్గర ఊరికే కూర్చోలేదు. ఇంగ్లండ్ జట్టు కోసం ఓ కొత్త రకం వైవిధ్యమైన బంతిని ప్రాక్టీస్ చేస్తున్నాడు.
సాక్షి క్రీడావిభాగం
అశ్విన్ అరంగేట్రం చేసిన తర్వాత భారత్ గెలిచిన 8 టెస్టు సిరీస్‌లలో ఏడుసార్లు అతనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్. భారత్ ఆడిన గత నాలుగు టెస్టు సిరీస్‌లలోనూ అతనే ఈ ఘనతను సాధించాడు. సాధారణంగా ఈ స్థాయి ఫామ్‌లో ఉన్న క్రికెటర్ కొంచెం విశ్రాంతి లభించగానే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళతాడు. కానీ అశ్విన్ మాత్రం చెన్నైలో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం రోజుకు నాలుగు గంటల పాటు జిమ్‌లో గడుపుతున్నాడు. ఇంట్లోనే జిమ్ ఉండటంతో... సరదాగా తన 14 నెలల కూతురిని కూడా తీసుకుని జిమ్‌లో ఆడిస్తున్నాడు. ఓ వైపు కుటుంబంతో సరదాగా గడుపుతూనే తన ‘మిషన్’ను కొనసాగిస్తున్నాడు. అశ్విన్‌కు ఏ మాత్రం సమయం దొరికినా తన పాత స్నేహితులతో కలిసి ఇంటి దగ్గర గల్లీ క్రికెట్ ఆడటం అలవాటు. ఇప్పుడు కూడా ప్రతి రోజూ గల్లీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అరుుతే... ఇందులోనే తను కొత్త ప్రయోగం కూడా చేస్తున్నాడు.
ఇప్పటికే ఐదు రకాలు...
చాలామంది ఆఫ్ స్పిన్నర్లలాగే అశ్విన్ కూడా ఐదు రకాల బంతులను ప్రధానంగా వాడతాడు. ఆఫ్ స్పిన్నర్, క్యారమ్ బాల్, టాప్ స్పిన్, స్లైడర్, లెగ్ స్పిన్... ఈ ఐదు రకాలు వాడతాడు. నిజానికి ఆఫ్ స్పిన్నర్ లెగ్ స్పిన్ వేయడం అరుదు. కానీ అశ్విన్ ఈ స్కిల్‌ను కూడా బాగా పెంచుకున్నాడు. ఎంత సేపటికీ వికెట్లు రాకుండా, సెషన్ ముగిసిపోతున్న సమయంలో లెగ్ స్పిన్‌తో బ్యాట్స్‌మన్‌ను అయోమయంలోకి నెడుతున్నాడు. గత ఏడాది కాలంగా ఈ స్కిల్‌ను బాగా వినియోగిస్తున్నాడు.
ఇక స్లైడర్ కూడా ఒక రకంగా అశ్విన్ కనిపెట్టిన వైరైటీనే. ధోని తరచుగా టి20ల్లో అశ్విన్‌కు కొత్త బంతి ఇస్తుంటాడు. కొత్త బంతి ఎక్కువ టర్న్ కాదు కాబట్టి... స్లైడర్‌ను సంధిస్తాడు. ఇది సాధారణంగా ఫాస్ట్‌బౌలర్ వేసే అవుట్ స్వింగర్‌లా ఉంటుంది. ఇక సాధారణ పిచ్‌లపై కూడా ఎక్కువ బౌన్‌స కోసం టాప్ స్పిన్ వేస్తాడు. నిజానికి ఇది చాలా కష్టమైన బంతి. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ కనిపెట్టిన క్యారమ్ బాల్‌ను అతనికంటే బాగా వాడుతున్న స్పిన్నర్ అశ్విన్. ముఖ్యంగా టెరుులెండర్ల కోసం ఈ బంతిని వాడతాడు.
ఇక అందరిలాగే ఆఫ్ స్పిన్ వేసే అశ్విన్... బంతిని సంధించడంలో మిగిలిన స్పిన్నర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. చాలామంది స్పిన్నర్లు చూపుడు వేలు, మధ్యవేలు కలిపి బంతి వేస్తారు. కానీ ఆఫ్ స్పిన్ కోసం అశ్విన్ కేవలం చూపుడు వేలును మాత్రమే వాడతాడు. ఇన్ని రకాల బంతులను సమయానుకూలంగా వాడతాడు కాబట్టే అశ్విన్ చెంత రికార్డులు వచ్చి వాలుతున్నారుు. ఇప్పటికే భారత పిచ్‌లపై అశ్విన్ బౌలింగ్‌లో ఆడటానికి నరకం చూస్తున్న విదేశీ బ్యాట్స్‌మెన్‌కు ఈసారి ఎలాంటి భిన్నమైన బంతిని చూపించబోతున్నాడో చూడాలి.
ఇప్పుడే ఎందుకంటే...
నిజానికి అశ్విన్‌కు విశ్రాంతి సమయం దొరకడం చాలా అరుదు. మూడు ఫార్మాట్లలోనూ తుది జట్టులో కచ్చితంగా ఉండే అశ్విన్‌కు... రెగ్యులర్ ప్రాక్టీస్‌కే సమయం సరిపోతుంది. అందుకే పెద్దగా ప్రయోగాలు చేయడు. క్యారమ్ బాల్ అనగానే అందరికీ మెండిస్ గుర్తొస్తున్నాడు. అలాగే ఓ ప్రత్యేకమైన బంతిని కనిపెట్టి తాను కూడా చరిత్రలో నిలిచిపోవాలనే ఆలోచన అశ్విన్‌కు ఉండి ఉండొచ్చు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. గల్లీ క్రికెట్‌లో స్నేహితులతో ఆడుతూనే ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికిప్పుడు కొత్త బంతిని తయారు చేయలేకపోవచ్చు. కానీ ఎంత త్వరగా దానిని తయారుచేస్తే అంత ఎక్కువగా మరిన్ని వికెట్లు తీయొచ్చు. కాబట్టి కెరీర్‌లో పీక్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు.
టెస్టుల్లో ఇంగ్లండ్ ప్రమాదం...
గత పదేళ్లలో భారత జట్టును సొంతగడ్డపై ఇబ్బంది పెట్టిన జట్టు ఏదైనా ఉందంటే అది ఇంగ్లండ్. 2008లో స్వదేశంలో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా ఆ జట్టు చేతిలో మూడు సిరీస్‌లు ఓడిపోయింది. 2012లో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 1-2తో ఓడిపోవడం పెద్ద షాక్. ఆ సిరీస్ ఓడిపోయిన జట్టులో అశ్విన్ కూడా ఉన్నాడు. నిజానికి అప్పటికే అశ్విన్ భారత జట్టుకు ప్రధాన బౌలర్. ఇంగ్లండ్ మినహా మిగిలిన అన్ని జట్లతోనూ అశ్విన్ రికార్డు బాగుంది. కాబట్టి ఈసారి సిరీస్ ద్వారా ఇంగ్లండ్‌తో కూడా లెక్క సరిజేయాలనేది అశ్విన్ ఆలోచన. తను చేస్తున్న ప్రయోగం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందే పూర్తై అశ్వినాస్త్రం సిద్ధమైతే... రాబోయే సిరీస్‌నూ అలవోకగా గెలవచ్చు. భారత బృందం కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.