ఏ ఒక్కరూ ఊహించలేదు
న్యూఢిల్లీ: టీమిండియాతో రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ రాణిస్తుందని ఎవరూ ఊహించలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో కుక్ సేన అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. రాజ్‌కోట్ స్టేడియంలో పిచ్ బాగుందని, తమ జట్టు విజయం అంచు వరకు వెళ్లిందని బోథమ్ అన్నాడు. ఇంగ్లీష్ మెన్ అన్ని విభాగాల్లో సత్తాచాటారని చెప్పాడు. కాగా టీమిండియా ప్రస్తుత బలాన్ని చూస్తే ఆ జట్టును దాదాపు ఆపలేరన్నాడు.
అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ సేన అగ్రస్థానంలో ఉంది. అంతేగాక ఇటీవల సొంతగడ్డపై మెరుగైన రికార్డు ఉంది. అయినా రాజ్‌కోట్ టెస్టులో భారత జట్టుతో పోలిస్తే ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా ఆడింది. ఓ దశలో కుక్ సేన విజయం దిశగా వెళ్లినా కోహ్లీ పోరాటపటిమతో ఈ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో చెత్తప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్.. రాజ్‌కోట్ టెస్టులో రాణించడం అభిమానులను కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇరు దేశాల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి విశాఖపట్నంలో జరగనుంది.