క్యాండీ: ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ (119 బంతుల్లో 64; 1 ఫోర్, 6 సిక్స్‌లు) చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడటంతో శ్రీలంకతో బుధవారం మొదలైన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (63; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... బర్న్స్ (43; 5 ఫోర్లు), ఆదిల్ రషీద్ (31; 2 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో తడబడింది. లంక స్పిన్నర్లు దిల్‌రువాన్ పెరీరా (4/61), పుష్పకుమార (3/89), అఖిల ధనంజయ (2/80) ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు.
జెన్నింగ్స్ (1), స్టోక్స్ (19), కెప్టెన్ రూట్ (14), మొయిన్ అలీ (10), ఫోక్స్ (19) నిరాశ పరిచారు. 225 పరుగులకే 9 వికెట్లు పడిన దశలో కరన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అండర్సన్ (7 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment