
2025 ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) టైటిల్‌ను దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) చేజిక్కించుకుంది. నిన్న (ఫిబ్రవరి 9) జరిగిన ఫైనల్లో క్యాపిటల్స్ డెజర్ట్ వైపర్స్‌ను (Desert Vipers) 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో రోవ్‌మన్ పావెల్ (38 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సికందర్ రజా (12 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్‌ను గెలిపించారు.
Pride. Ecstacy. Honour. Valour. Glory. Legacy. ✨
No better & prouder moment for the @Dubai_Capitals, than when they get their hands on the 🏆#Final #DPWorldILT20 #TheFinalPush #AllInForCricket pic.twitter.com/vgOOrqjDid— International League T20 (@ILT20Official) February 9, 2025
190 పరుగుల లక్ష్య ఛేదనలో 39 పరుగులకే మూడు వికెట్లు (డేవిడ్ వార్నర్ (4), గుల్బదిన్ నైబ్ (5), సామ్ బిల్లింగ్స్ (6)) కోల్పోయిన క్యాపిటల్స్‌ను పావెల్, షాయ్ హోప్ (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరూ క్యాపిటల్స్ స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. ఈ దశలో సామ్ కర్రన్ హోప్‌ను పెవిలియన్‌కు పంపి వైపర్స్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చాడు.
అయితే హోప్ ఔటయ్యాక కూడా పావెల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్యాపిటల్స్‌ను గెలుపు రేసులో ఉంచాడు. చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన తరుణంలో సికందర్ రజా మ్యాజిక్ చేశాడు. మొహమ్మద్ ఆమిర్ వేసిన 19వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన రజా.. చివరి ఓవర్‌లో సిక్సర్, బౌండరీ బాది క్యాపిటల్స్‌ను తొలి టైటిల్‌ను అందించాడు.
పావెల్ ఔటయ్యాక దుసన్ శనక (10 బంతుల్లో 21; 2 సిక్సర్లు) సికందర్ రజాకు మద్దతుగా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో క్యాపిటల్స్ టైటిల్ సాధించేందుకు దోహదపడిన రోవ్‌మన్ పావెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సామ్ కర్రన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.
మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయ్ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓబెద్ మెక్‌కాయ్ ధాటికి వైపర్స్ 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్, అలెక్స్ హేల్స్ తలో ఐదు పరుగులు చేసి మెక్‌కాయ్ బౌలింగ్‌లో ఔటయ్యారు.
ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్ హోల్టన్ (51 బంతుల్లో 76; 12 ఫోర్లు), కెప్టెన్ సామ్ కర్రన్ (33 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వైపర్స్ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. వీరిద్దరు మెరుపు అర్ద శతకాలు చేసి వైపర్స్‌కు భారీ స్కోర్ అందించారు. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (13 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్యాపిటల్స్ బౌలర్లలో మెక్‌కాయ్ 2, హైదర్ అలీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన క్యాపిటల్స్ ఆదిలో తడబడింది. షాయ్ హోప్, రోవ్‌మన్ పావెల్ బాధ్యతాయుతమై ఇన్నింగ్స్‌లు ఆడి క్యాపిటల్స్‌ను గేమ్‌లో ఉంచారు. ఆఖర్లో సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడి క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. పావెల్, హోప్, రజా దెబ్బకు క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, డేవిడ్ పేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, నాథన్ సౌటర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, దుబాయ్ క్యాపిటల్స్ ఈ టోర్నీలో మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. తొలి ఎడిషన్‌లో గల్ఫ్ జెయింట్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో ఎంఐ ఎమిరేట్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్‌పై గెలుపొంది టైటిల్ గెలుచుకుంది. వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్‌కు చేరిన క్యాపిటల్స్ ఎట్టకేలకు టైటిల్‌ను కైవసం చేసుకుంది.