దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ కథ ముగిసింది. వరుసగా రెండో సీజన్‌లోనూ ఆ జట్టు ఎలిమినేటర్ దశ దాటలేకపోయింది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్.. నైట్‌రైడర్స్‌ను 85 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. క్యాపిటల్స్ ఆటగాడు సికందర్ రజా (40, 2/27) ఆల్‌రౌండ్ షోతో నైట్‌రైడర్స్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. టామ్ బాంటన్ (44), ఏబెల్ (41), సామ్ బిల్లింగ్స్ (46 నాటౌట్), సికందర్ రజా (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సాబిర్ అలీ 2, విల్లే, జాషువ లిటిల్, ఫేబియన్ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. సికందర్ రజాతో పాటు స్కాట్ కుగ్గెలిన్ (4/17), జహీర్ ఖాన్ (2/25), ఓలీ స్టోన్ (1/18) విజృంభించడంతో 16.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ హెయిన్ (29), జో క్లార్క్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
కాగా, ఈ సీజన్ క్వాలియర్-1కు ఎంఐ ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ ఇదివరకే అర్హత సాధించగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఫిబ్రవరి 15న జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ మధ్య క్వాలియర్-1 మ్యాచ్ ఇవాళ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment