సిరీస్‌ సమర్పయామి | England win by 60 runs | Sakshi
Sakshi News home page

సిరీస్‌ సమర్పయామి

Published Mon, Sep 3 2018 3:28 AM | Last Updated on Mon, Sep 3 2018 6:29 AM

England win by 60 runs - Sakshi

మళ్లీ అదే నిరాశాజనక ప్రదర్శన. మరోసారి అదే తరహా పరాభవం. చివరి ఇన్నింగ్స్‌లో స్వల్ప లక్ష్యాలను కూడా ఛేదించడంలో తమ బలహీనతను బయట పెట్టుకుంటూ భారత్‌ నాలుగో టెస్టులోనూ తలవంచింది. ఒక్కసారి కోహ్లి ఔటైతే ఇక తమ వల్ల కాదన్నట్లుగా ఇతర బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులెత్తేయడంతో మరో ఓటమి మన ఖాతాలో చేరింది. అచ్చు తొలి టెస్టు ఫలితాన్ని తలపించిన పరాజయంతో  మరో టెస్టు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ 1–3తో సిరీస్‌ కోల్పోయింది.

ఒక దశలో భారత్‌ స్కోరు 123/3... కానీ 61 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు ఫట్‌... కోహ్లి, రహానే 101 పరుగుల భాగస్వామ్యం ఆశలు రేకెత్తించినా మ్యాచ్‌ గెలిపించలేకపోయింది. అగ్రశ్రేణి స్పిన్నర్‌గా గుర్తింపు ఉన్న అశ్విన్‌ విఫలమైన చోటనే ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ మన పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో  5 వికెట్లు తీసిన అతను ఈసారి 4 కీలక వికెట్లతో భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఫలితంగా సిరీస్‌లో రెండోసారి చేరువగా వచ్చి కూడా భారత్‌కు విజయం దూరమైంది.   


సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌ గడ్డపై ఈసారి టెస్టు సిరీస్‌ గెలవగల సత్తా ఉన్న జట్టుగా కనిపించిన భారత్‌ అంచనాలను అందుకోలేకపోయింది. మన బౌలర్లు మెరుగైన అవకాశాలు సృష్టించినా... బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌లో పోరాటం ముగించింది. ఇక్కడి రోజ్‌ బౌల్‌ మైదానంలో నాలుగో రోజే ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ 60 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ 69.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది.

విరాట్‌ కోహ్లి (130 బంతుల్లో 58; 4 ఫోర్లు), అజింక్య రహానే (159 బంతుల్లో 51; 1 ఫోర్‌) అర్ధ సెంచరీలు సాధించినా ఇతర బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారత్‌కు నిరాశ తప్పలేదు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొయిన్‌ అలీ (4/71) చెలరేగగా... అండర్సన్, స్టోక్స్‌ చెరో 2 వికెట్లతో అండగా నిలిచారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 260/8తో ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 11 పరుగులు మాత్రమే జోడించి 271 పరుగులకు ఆలౌటైంది. తాజా ఫలితంతో 5 టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–1తో సొంతం చేసుకుంది. ఈ నెల 7 నుంచి ఓవల్‌ మైదానంలో చివరి టెస్టు జరుగుతుంది.  

శతక భాగస్వామ్యం...
పిచ్‌ పరిస్థితి, గత రికార్డును బట్టి చూస్తే కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు నిరాశాజనకమైన ఆరంభం లభించింది. బ్రాడ్‌ అద్భుత బంతితో రాహుల్‌ (0)ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా, తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో పుజారా (5)ను అండర్సన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అతని తర్వాతి ఓవర్లోనే ధావన్‌ (17) కూడా వెనుదిరగడంతో భారత్‌ స్కోరు 22/3 వద్ద నిలిచింది. ఈ స్థితిలో జట్టును కోహ్లి, రహానే ఆదుకునే ప్రయత్నం చేశారు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లికి వివాదాస్పద రీతిలో అదృష్టం కలిసొచ్చింది.

అలీ బౌలింగ్‌లో ఎల్బీకి అప్పీల్‌ చేసిన ఇంగ్లండ్‌ అంపైర్‌ స్పందించకపోవడంతో రివ్యూ కోరింది. బ్యాట్‌ తగిలిందని చెబుతూ థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించారు. అయితే రీప్లేలో కోహ్లి ఔటైనట్లుగా కనిపించింది. 15 పరుగుల వద్ద కూడా ఇంగ్లండ్‌ కోహ్లి ఎల్బీ కోసం రివ్యూ కోరినా ఫలితం భారత్‌కు అనుకూలంగానే వచ్చింది. ఈ దశలో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌ కలిసి సమర్థంగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్నారు. అటు పేస్, ఇటు స్పిన్‌తో ఇంగ్లండ్‌ ఎంతగా ప్రయత్నించినా వీరిద్దరు పొరపాటుకు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో కోహ్లి 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. దాంతో భారత్‌ సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది.  

మొయిన్‌ అలీ జోరు...
టీ విరామానికి ముందు భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అలీ బంతిని ఆడబోయిన కోహ్లి, షార్ట్‌లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. బ్యాట్‌కు బంతి తగల్లేదనే ఉద్దేశంతో కోహ్లి రివ్యూ కోరినా రీప్లేలో ఔట్‌గానే తేలింది. అంతే... ఆ తర్వాత భారత్‌ పతనం ఏ దశలోనూ ఆగలేదు. హార్దిక్‌ పాండ్యా (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తనకు తెలిసిన రీతిలో దూకుడుగా ఆడబోయి వెనుదిరిగాడు. అలీ వేసిన చక్కటి బంతికి రహానే కూడా ఎల్బీడబ్లు్య కావడంతో భారత్‌ ఆశలు కోల్పోయింది. చివర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ (36 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా ఏమాత్రం లాభం లేకపోయింది. తొలి రోజు జట్టు స్కోరు 86/6 వద్ద బ్యాటింగ్‌కు దిగి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు విరాట్‌ కోహ్లి వికెట్‌ కూడా తీసి మ్యాచ్‌ గతిని మార్చిన ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌... అశ్విన్‌ను ఆఖరి వికెట్‌గా ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.     

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 246; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 273; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 271; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 17; రాహుల్‌ (బి) బ్రాడ్‌ 0; పుజారా (ఎల్బీ) (బి) అండర్సన్‌ 5; కోహ్లి (సి) కుక్‌ (బి) అలీ 58; రహానే (ఎల్బీ) (బి) అలీ 51; పాండ్యా (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 0; పంత్‌ (సి) కుక్‌ (బి) అలీ 18; అశ్విన్‌ (ఎల్బీ) (బి) కరన్‌ 25; ఇషాంత్‌ (ఎల్బీ) (బి) స్టోక్స్‌ 0; షమీ (సి) అండర్సన్‌ (బి) అలీ 8; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్‌) 184. 

వికెట్ల పతనం: 1–4; 2–17; 3–22; 4–123; 5–127; 6–150; 7–153; 8–154; 9–163; 10–184.  

బౌలింగ్‌: అండర్సన్‌ 11–2–33–2; బ్రాడ్‌ 10–2–23–1; మొయిన్‌ అలీ 26–3–71–4; స్టోక్స్‌ 12–3–34–2; కరన్‌ 3.4–2–1–1; రషీద్‌ 7–3–21–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement