బ్రాడ్,అండర్సన్
మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో తొలిసారి ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియాను కంగారుపెట్టారు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ ఘోరంగా దెబ్బతీశారు. ఫలితంగా నాలుగో టెస్టులో క్లార్క్‌సేన తడబడింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 73.3 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది.
రోజెర్స్ (61), హాడిన్ (43 బ్యాటింగ్) కాస్త పోరాడినా... మిగతా వారు పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్లార్క్‌సేన ఇంకా 91 పరుగులు వెనుకబడి ఉంది. లంచ్‌కు కొద్ది ముందు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ స్వల్ప వ్యవధిలో వార్నర్ (9), వాట్సన్ (10) వికెట్లను కోల్పోయింది.
లంచ్ తర్వాత రోజెర్స్ నిలకడగా ఆడినా క్లార్క్ (10) నిరాశపర్చాడు. రోజెర్స్, స్మిత్ (19)లు నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్ కావడంతో ఆసీస్ 112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. బెయిలీ (0) విఫలమైనా... హాడిన్ క్రీజులో పాతుకుపోయాడు. కానీ జాన్సన్ (2), హారిస్ (6), సిడిల్ (0) వెంటవెంటనే అవుట్ కావడంతో ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అండర్సన్, బ్రాడ్ చెరో మూడు వికెట్లు తీయగా, బ్రెస్నన్‌కు 2, స్టోక్స్‌కు ఒక్క వికెట్ దక్కింది.
అంతకుముందు 226/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. పీటర్సన్ (71) ఓవర్‌నైట్ స్కోరు మరో 4 పరుగులు జోడించి అవుట్ కాగా... బ్రాడ్ (11), పనేసర్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయారు. జాన్సన్ 5, హారిస్ 2, సిడిల్, లియోన్, వాట్సన్ తలా ఓ వికెట్ తీశారు.