షమీ చుట్టూ కేసుల ఉచ్చు    | Enrollment under multiple sections | Sakshi
Sakshi News home page

షమీ చుట్టూ కేసుల ఉచ్చు   

Published Sat, Mar 10 2018 4:42 AM | Last Updated on Sat, Mar 10 2018 7:27 AM

Enrollment under multiple sections - Sakshi

కోల్‌కతా: టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ షమీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోయింది.  వ్యక్తిగత, క్రీడా జీవితంపై అతడి భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపణల ఉదంతం కేసుల నమోదు వరకు చేరింది. తన భర్త మోసగాడని,  తీవ్రంగా హింసిస్తున్నాడని, పలువురు యువతులతో సంబంధాలున్నాయని, పాకి స్తానీ స్నేహితురాలి నుంచి డబ్బులు తీసుకున్నాడంటూ ఇప్పటికే జహాన్‌ మీడియాకెక్కింది. తాజాగా ఆమె ఫిర్యాదుతో శుక్రవారం కోల్‌కతా పోలీసులు షమీ సహా అతని కుటుంబ సభ్యులు నలుగురిపై కేసులు నమోదు చేశారు.

సెక్షన్‌ 307 (హత్యాయత్నానికి పాల్పడటం), సెక్షన్‌ 498ఎ (గృహ హింస), సెక్షన్‌ 376 (లైంగిక దాడి)ల కింద నాన్‌ బెయిలబుల్, సెక్షన్‌ 323 (ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), సెక్షన్‌ 506 (నేరపూరిత బెదిరింపు)ల కింద జాదవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు కోల్‌కతా జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ (క్రైం) ప్రవీణ్‌ త్రిపాఠి తెలిపారు. వీటిలో సెక్షన్‌ 376 కింద కేసును షమి సోదరుడిపై పెట్టినట్లు పేర్కొన్నారు. ఏడాది క్రితం యూపీలో తన అత్తారింటికి వెళ్లినప్పుడు షమీ సోదరుడు షోయబ్‌ అహ్మద్‌ తనపై  అత్యాచారం చేసినట్లు హసీన్‌ ఫిర్యాదులో పేర్కొంది.

మరోవైపు షమీపై ఆరోపణల అనంతరం ఫేస్‌ బుక్‌లో తన ఖాతాను బ్లాక్‌ చేశారని హసీన్‌ ఆరోపించింది. ‘కొన్నేళ్లుగా వారు నన్ను తీవ్రంగా హింసించారు. ఆ కుటుంబంలో ఒక్కరు కూడా నాకు అం డగా నిలవలేదు. షమీ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తారు. నేనక్కడకు వెళ్లినప్పుడల్లా వేధించేవారు. వారంతా వేచి చూడాలని మాత్రమే చెప్పేవారు తప్ప షమీకి వ్యతిరేకంగా ఏమీ చేసేవారు కాదు’ అని ఆమె పేర్కొంది.

వివాదం నేపథ్యంలో షమీకి రెండు రోజుల క్రితం ప్రకటించిన బీసీసీఐ కాంట్రాక్టుల్లో చోటుదక్కలేదు. అయితే... అతడికి ఊహించని విధంగా దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ నుంచి మద్దతు లభించింది. షమిది కష్టపడే తత్వమని, కుటుంబ సమస్యలు ఉన్నట్లు తనకు తెలుసని కానీ అతడి భార్య ఇలాంటి ఆరోపణలకు దిగడం సరికాదని కపిల్‌ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇవన్నీ నిజమైతే షమీని ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement