
తొలి పవర్‌ప్లేలో 47 పరుగులే చేసిన ఇంగ్లండ్ ఓపెనర్స్.. తర్వాతి 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు..
బర్మింగ్‌హామ్ : భారత మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్ ద్వయాన్ని దాటిగా ఎదుర్కోవడమే తమ విజయానికి కలుసొచ్చిందని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్‌సేన 31 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న విషయం తెలిసిందే. అయితే తొలి పవర్‌ప్లేలో 47 పరుగులే చేసిన ఇంగ్లండ్ ఓపెనర్స్.. తర్వాతి 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు పిండుకున్నారు. ఇదే మ్యాచ్ తమవైపు తిరిగేలా చేసిందని మ్యాచ్ అనంతరం మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ‘ఈరోజు మేం అద్భుతం సృష్టించాం. టాస్ గెలవడం.. బ్యాటింగ్ ఎంచుకోవడం అన్నీ మాకు కలిసొచ్చాయి. జాసన్ పునరాగమనం, బెయిర్‌స్టో విధ్వంసం అద్భుతం. వారి భాగస్వామం భారీ లక్ష్యాన్ని నిర్ధేశించేలా చేసింది. భారత మణికట్టు స్పిన్నర్లపై జాసన్, బెయిర్‌స్టో విరుచుకుపడటం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. 10 నుంచి 20 ఓవర్ల మధ్యే మ్యాచ్ తమవైపు తిరిగింది. ఈ ఓవర్లలో సుమారు 90 పరుగులు చేసామనుకుంటా. ఈ తరహా ఆటనే మేం ఆశిస్తున్నాం. పిచ్ సీమ్ అనుకూలిస్తుండటంతో బంతి ఏమాత్రం బ్యాట్‌పైకి రాలేదు. అందుకే చిన్నగా కట్టర్స్, స్లో బంతులను ఆడాం. బెయిర్‌స్టో, జాసన్ దాటిగా ఆడి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పారు. ఇది ఇంగ్లండ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. దీంతో ఆటగాళ్లు సాయశక్తుల కష్టపడ్డారు. ఈ గెలుపు మాలో ఎంతో ఉత్సాహన్ని నింపింది. ప్లంకేట్ కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇదే స్పూర్తితో మిగతా మ్యాచ్‌లను కూడా గెలుస్తాం.’ అని మోర్గాన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ ద్వయం పూర్తిగా తేలిపోయింది. 10 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 88 పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డు మూటగట్టుకోగా.. కుల్దీప్ 72 పరుగులిచ్చాడు. దీంతో ఆతిథ్య జట్టు రెచ్చిపోయింది. చివర్లో పేస్ ద్వయం బుమ్రా, షమీలు చెలరేగడంతో 337 పరుగులకు పరిమితమైంది.
చదవండి: ధోని–జాదవ్ ఇంత చెత్తగానా?