ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస పరాజయాలు (6 మ్యాచ్‌ల్లో 5 అపజయాలు) ఎదుర్కొంటూ ఘోర నిష్క్రమణ దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి, ఇంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టును నేనెప్పుడూ చూడలేదని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఏదో అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశాడు.
గెలుపు కోసం జట్టు అవలంబిస్తున్న పద్ధతి, మ్యాచ్‌లను వారు కోల్పోయిన తీరు చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతుందని బాంబు పేల్చాడు. 2019లో ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించి, ఆ దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్, సొంత జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
మోర్గాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలీదు కానీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యుడు లివింగ్‌స్టోన్ స్పందించాడు. జట్టు సభ్యులందరికీ మోర్గాన్‌పై అమితమైన గౌరవం ఉంది. అతను ఈ తరహా వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పగలను అతను అన్న విధంగా జట్టులో ఎలాంటి మనస్పర్థలు లేవు. మోర్గాన్ ఊహించిన విధంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమీ జరగడం లేదు. జట్టులో అందరం కలిసికట్టుగా ఉన్నాం. ప్రతి మ్యాచ్‌లో వంద శాతం విజయాల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే మాకేదీ కలిసి రావడం లేదంటూ మోర్గాన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు.
ఇదిలా ఉంటే, టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని (230) కూడా చేధించలేక 100 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో కేవలం బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలుపొందిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.
బట్లర్ సేన తదుపరి జరిగే 3 మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్) రెండు మ్యాచ్‌ల్లో ఒడినా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత కోల్పోతుంది. కాగా, ప్రపంచకప్‌లో లీగ్ దశ తర్వాత టాప్-7లో నిలిచే జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment