ఇంగ్లండ్‌ జట్టుకు ఏమైంది.. కనీసం 200 పరుగులు కూడా చేయలేని దీన స్థితికి దిగజారింది | India Vs England 2023 World Cup: In Continuous Three Match, England Batters Have Failed To Reach 200 Run Mark- Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ జట్టుకు ఏమైంది.. కనీసం 200 పరుగులు కూడా చేయలేని దీన స్థితికి దిగజారింది

Published Mon, Oct 30 2023 12:52 PM | Last Updated on Mon, Oct 30 2023 1:01 PM

CWC 2023: In Continuous Three Match, England Batters Have Failed To Breach 200 Run Mark - Sakshi

వన్డే ఫార్మాట్‌తో పాటు టీ20 ఫార్మాట్‌లోనూ ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. క్వాలిఫయర్స్‌ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌, శ్రీలంక జట్లు.. బలహీన జట్లైన బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ (ఇంగ్లండ్‌తో పోలిస్తే) జట్లు కూడా ఇంగ్లండ్‌ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి.

అరివీర భయంకరులైన బ్యాటర్లు.. నిప్పులు చెరిగే ఫాస్ట్‌ బౌలర్లు.. వరల్డ్‌ క్లాస్‌ స్పిన్నర్లతో కూడి, ప్రపంచంలోని ఎంతటి మేటి జట్టుకైనా చెమటలు పట్టించగల సత్తా ఉన్న ఇంగ్లండ్‌ జట్టు ప్రస్తుత టోర్నీలో క్రికెట్‌ పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ చేతుల్లో సైతం ఓటమిపాలై ఘోర అపవాదును మూటగట్టుకుంది. భారత్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా లాంటి వరల్డ్‌ క్లాస్‌ జట్ల చేతుల్లో ఓటమి మాట అటుంచితే.. క్వాలిఫయర్స్‌ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక చేతుల్లో కూడా ఓడి సొంత జనాలచే చీవాట్లు తింటుంది.

ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. ఆ జట్టు చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీస​ 200 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో విధ్వంసకర వీరులతో నిండిన ఇంగ్లీష్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఒక్కో పరుగు చేసేందుకు నానా కష్టాలు పడి, చిన్న జట్లు కూడా వారిపై సానుభూతి చూపే స్థాయికి దిగజారింది. ఆ జట్టు భారత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 129, అంతకుముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 156, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 170 పరుగులకు ఆలౌటై క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న జట్ల కంటే దారుణంగా తయారైంది.

ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో అలవోకగా 400 పరుగుల మార్కును దాటేసిన ఇంగ్లండ్‌ జట్టు ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో సగటు క్రికెట్‌ అభిమాని ఆశ్చర్యపోతున్నాడు. వన్డేల్లో టాప్‌ త్రీ టీమ్‌ స్కోర్లు (498, 481, 444) తమ పేరిటే కలిగి ఉన్న జట్టు కనీసం 200 పరుగులు కూడా చేయలేని దీన స్థితికి దిగజారడంతో జాలిపడుతున్నాడు. ఇంగ్లండ్‌ ఈ స్థాయికి దిగజారడానికి కారణమేమై ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement