టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 12000 పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత్‌తో తొలి టీ20 సందర్భంగా జోస్ ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. జోస్‌కు ముందు క్రిస్ గేల్ (14562), షోయబ్ మాలిక్ (13492), కీరన్ పోలార్డ్ (13429), అలెక్స్ హేల్స్ (13361), విరాట్ కోహ్లి (12886), డేవిడ్ వార్నర్ (12757) మాత్రమే టీ20ల్లో 12000 పరుగులు చేశారు.
టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గేల్ (343 మ్యాచ్‌ల్లో), విరాట్, వార్నర్ బట్లర్ కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు. బట్లర్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు (భారత్‌తో తొలి టీ20 కలుపుకుని) 430 మ్యాచ్‌లు ఆడి 145.29 స్ట్రయిక్‌రేట్‌తో, 35.08 సగటున 12035 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 84 అర్ద సెంచరీలు ఉన్నాయి.
బట్లర్ ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌లోనే సెంచరీ, 26 అర్ద సెంచరీల సాయంతో 3457 పరుగులు చేశాడు. బట్లర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ బట్లరే.
భారత్, ఇంగ్లండ్ తొలి టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు.
బట్లర్‌తో పాటు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.
133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసిన సంజూ శాంసన్ కూడా బ్యాట్‌ను ఝులిపించాడు.
శాంసన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment