ఆఫ్రిది బిల్లు చెల్లించిన అభిమాని!
కరాచీ: మామూలుగా క్రికెటర్లు ఎక్కడికి వెళ్లినా... డబ్బులకు ఏమాత్రం కొదువ ఉండదు. కానీ కొన్ని సమయాల్లో ఎంత డబ్బున్నా... అది ఉపయోగపడకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో పాకిస్తాన్ టి20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి బాగా ఆర్థమైంది. క్రికెట్ పర్యటన కోసం న్యూజిలాండ్ వెళ్లిన ఆఫ్రిది... సహచరుడు అహ్మద్ షెహజాద్‌తో కలిసి సోమవారం ఆక్లాండ్ విమానాశ్రయంలోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. మీల్స్ ఆర్డర్ చేశాక డబ్బులు ఇవ్వడానికి వెళ్తే జేబులో మొత్తం యూఎస్ కరెన్సీ మాత్రమే ఉంది. అయితే రెస్టారెంట్‌లో స్థానిక కరెన్సీ మాత్రమే తీసుకుంటుండడంతో క్రికెటర్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఆర్డర్ క్యాన్సిల్ చేయలేక.. డబ్బులు కట్టలేక దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో.. ఇదంతా గమనించిన వకాస్ నవీద్ అనే ఓ అభిమాని వచ్చి బిల్లును చెల్లించడంతో ఆఫ్రిది ఊపిరి పీల్చుకున్నాడు. రెస్టారెంట్ ఎపిసోడ్‌ను ఎవరో రహస్యంగా చిత్రీకరించి మీడియాకు ఇవ్వడంతో విషయం మొత్తం బయటకు వచ్చేసింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే కివీస్ బయలుదేరటానికి ముందు లాహోర్‌లో ఆఫ్రిది.. మీడియాతో గొడవపడటం. తాము అడిగిన ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో మీడియా మొత్తం గడాఫీ స్టేడియం వద్ద నిరసనకు దిగింది. ఇక రెస్టారెంట్ ఎపిసోడ్ దొరకడంతో పాక్ మీడియా మొత్తం ఆఫ్రిదిని ఓ ఆటాడేసుకుంది.