
పుణె : తమ అభిమాన ఆటగాళ్లను నేరుగా చూసేందుకు కొంతమంది ఫ్యాన్స్ మైదానంలోకి పరిగెత్తుకు వెళ్తున్న ఘటనలు తరచుగా చూస్తేనే ఉన్నాం. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, కెప్టెన్ కోహ్లిని ఇబ్బంది పెట్టిన వీరాభిమానులు ఎందరో ఉన్నారు. తాజాగా రోహిత్ శర్మకు కూడా మరోసారి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మెరుగ్గా రాణించి మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కోహ్లి ద్విశతకానికి తోడు అజింక్య రహానే, జడేజా బ్యాట్ ఝులిపించి సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో 601/5 వద్ద కోహ్లి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు.
ఈ నేపథ్యంలో ప్రొటీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ వద్దకు ఓ అభిమాని పరిగెత్తుకు వచ్చాడు. రోహిత్ పాదాలను ముద్దాడేందుకు ప్రయత్నించడమే గాకుండా అతడి కాళ్లు పట్టుకుని లాగి కిందపడేశాడు. దీంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది వెంటనే పరిగెత్తుకొచ్చి అతడిని దూరంగా తీసుకవెళ్లారు. ఆ సమయంలో రోహిత్‌తో పాటు అతడికి సమీపంలోనే ఉన్న రహానే నవ్వుకుంటూ సదరు అభిమానిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment