
సాక్షి, హైదరాబాద్: రాజ్‌కోట్ టెస్టులో అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లితో సెల్ఫీ తీసుకున్న ఘటన తర్వాత ఇప్పుడు రెండో టెస్టుల్లో మళ్లీ అలాంటిదే జరిగింది. ఈసారి కోహ్లి ఫ్యాన్‌గా చెప్పుకున్న ఆ యువకుడు తన అభిమానాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాడు. సరిగ్గా చెప్పాలంటే అతిగా వ్యవహరించి క్షణ కాలం పాటు కోహ్లినే భయపెట్టేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. కోహ్లి ఫీల్డింగ్ కోసం మరో ఎండ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉండగా వెస్ట్ గ్యాలరీ నుంచి ఒక యువకుడు నేరుగా అతని వైపు దూసుకొచ్చాడు. ప్రమాదాన్ని ఊహించిన కోహ్లి తప్పించుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వేగంగా వచ్చిన అతను వెంటనే కోహ్లికి చేరువగా వచ్చి సెల్ఫీ తీసేసుకున్నాడు.
దీనికి కూడా సరేలే అన్నట్లుగా కెప్టెన్ సర్దుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు. అనూహ్యంగా కోహ్లి భుజాల మీదుగా చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టే ప్రయత్నం కూడా చేయడంతో బిత్తరపోవడం కోహ్లి వంతైంది. అతడి నుంచి తల తిప్పుకొని ఎలాగోలా దూరం జరిగిన విరాట్ ఆ ముద్దును తప్పించుకోగలిగాడు. ఇంత జరిగిన తర్వాత నింపాదిగా వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మొత్తానికి ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు. కోహ్లిని చూస్తే అతను కూడా ఒకింత ఆందోళనకు లోనైనట్లు కనిపించింది. ఈ రెండు ఘటనలు చూస్తే వీటిని ఏమాత్రం సరదాగా, అభిమానంతో చేసే పనులుగా చూడాల్సిన పరిస్థితి దాటిపోయింది. మైదానంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని ఇది చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment