'ఈ రోజు కోసం రెండేళ్లు కష్టపడ్డా'
న్యూఢిల్లీ: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్.. తాను కొత్తగా కెరీర్ ఆరంభిస్తున్నట్టు ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్కు భజ్జీని ఎంపిక చేశారు. ఈ రోజు కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నానని చెప్పాడు.
2013 తర్వాత అతనికి టీమిండియా బెర్తు దక్కడం ఇదే తొలిసారి. కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నట్టు ఉందని భజ్జీ వ్యాఖ్యానించాడు. బౌలింగ్ మెరుగుపరచుకునేందుకు కఠిన సాధన చేశానని చెప్పాడు. మరో నాలుగు, ఐదేళ్లు టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాని, రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని అన్నాడు. భజ్జీ చివరిసారిగా 2013 మార్చిలో హైదరాబాద్లో జరిగిన ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్భజన్ ఈ సీజన్లో రాణించాడు. ఈ ప్రదర్శన భజ్జీ టీమిండియాలో పునరాగమనానికి తోడ్పడింది.