
చెస్టర్ లీ స్ట్రేట్: శ్రీలంక క్రికెటర్ అవిష్క ఫెర్నాండో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక తరఫున అత్యంత పిన్నవయసులో సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫెర్నాండో శతకం సాధించాడు. 103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించి శ్రీలంక 338 పరుగుల భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. ఈ క్రమంలోనే పిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో లంక క్రికెటర్‌గా నిలిచాడు.
21 ఏళ్ల 90 రోజుల వయసులో ఫెర్నాండో వన్డే సెంచరీ సాధించగా, అంతకుముందు చండిమల్(20 ఏళ్ల 199 రోజుల వయసు), ఉపుల్ తరంగా(20 ఏళ్ల 212 రోజుల వయసు)లు పిన్న వయసులో వన్డే సెంచరీలు సాధించిన లంక క్రికెటర్లు. ఇప్పుడు ఆ తర్వాత స్థానాన్ని ఫెర్నాండో ఆక్రమించాడు. ఇదిలా ఉంచితే, ఇది ఫెర్నాండో తొలి వన్డే సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంక సాధించిన మొదటి సెంచరీ కూడా ఇదే కావడం మరో విశేషం. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. ఆడిన తొలి మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇప్పటివరకూ తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన ఫెర్నాండో 328 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment