![FIFA World Cup 2018: Senegal stun Poland 2-1 - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/20/SENEGAL-KUSH.jpg.webp?itok=WUiAC1RV)
మాస్కో: పాపం పోలాండ్... మ్యాచ్‌లో బంతి దాదాపు 60 శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. దాడుల్లోనూ మెరుగే. తప్పులూ తక్కువే చేసింది. కానీ థియాగో సియోనెక్ (37వ నిమిషం) సెల్ఫ్ గోల్ కొంపముంచింది. ఆ తర్వాత ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎంబె నియాంగ్ (60వ నిమిషం) మరో గోల్ కొట్టడంతో సెనెగల్ 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పోలాండ్ తరఫున క్రిచోవియాక్ (86వ నిమిషం) చివర్లో గోల్ చేసినా... అది ప్రత్యర్థి ఆధిక్యం తగ్గించేందుకే ఉపయోగపడింది. అంచనాలకు తగ్గట్లే మ్యాచ్ మొదట్లో సమతూకంతో సాగింది.
బ్లాస్జికొవొస్కీ, క్రిచోవియాక్‌లు సెనెగల్ స్టార్‌మానెను కట్టిపడేశారు. అయితే ఇద్రిస్సా గుయె షాట్‌ను తిప్పికొట్టే క్రమంలో పోలాండ్ ఆటగాడు సియోనెక్ అనూహ్యంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. 60వ నిమిషంలో బంతిని దొరకబుచ్చుకున్న నియాంగ్... బలహీనంగా ఉన్న పోలాండ్ రక్షణ శ్రేణిని ఛేదిస్తూ గోల్‌గా మలిచాడు. కీపర్ సెజెన్సీ గోల్ పోస్ట్‌ను వదిలి అప్పటికే చాలా దూరం వచ్చేయడంతో అడ్డుకునే అవకాశమూ లేకపోయింది. పోలాండ్ తరఫున చివర్లో క్రిచోవియాక్ గోల్ కొట్టినా అప్పటికే ఆలస్యమైంది. స్టార్ ఆటగాడు రాబర్ట్ లెవాన్‌డోస్కీ వైఫల్యం కూడా ఆ జట్టును దెబ్బతీసింది.
Comments
Please login to add a commentAdd a comment