
బ్రిస్బేన్: ప్రపంచ క్రికెట్‌లో పలు రకాలైన అవుట్‌లతో బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతూ ఉంటారు. అందులో అబ్‌స్ట్రక్టింగ్ అవుట్ ఒకటి. బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా బంతికి అడ్డుతగిలితే దానిని అబ్‌స్ట్రక్టింగ్ అవుట్‌గా పరిగణిస్తారు. ఈ అవుట్ ద్వారా ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తాజాగా బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ తరపున ఆడుతున్న అలెక్స్ రాస్ ఇలానే పెవిలియన్‌కు చేరడం వివాదానికి దారి తీసింది. మరొకవైపు బీబీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ అబ్‌స్ట్రక్టింగ్ అవుట్ ద్వారా పెవిలియన్‌కు చేరడం కూడా ఇదే తొలిసారి.
వివరాల్లోకి వెళితే.. బుధవారం బ్రిస్బేన్ హీట్-హోబార్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. డీ ఆర్సీ షార్ట్(122;69 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. ఆపై లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హరికేన్స్‌కు శుభారంభం లభించింది. అయితే సెకండ్ డౌన్‌లో వచ్చిన అలెక్స్ రాస్ కుదురుగా ఆడుతున్న సమయంలో అబ్‌స్ట్రక్టింగ్ అవుట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. బ్రిస్బేన్ హీట్ ఇన‍్నింగ్స్‌లో భాగంగా తైమాల్ మిల్స్ వేసిన 17 ఓవర్ చివరి బంతిని అలెక్స్ కవ్ కార్నర్‌లో కొట్టి తొలి పరుగును విజయవంతంగా పూర్తిచేశాడు. అయితే రెండో పరుగును తీసే క్రమంలో వేగంగా క్రీజ్‌లోకి దూసుకొచ్చాడు. ఆ సమయంలో బంతిని గమనించని అలెక్స్ వికెట్లకు అడ్డంగా పరిగెట్టడంతో బంతి అతన్ని తాకుతూ వికెట్లను పడగొట్టింది. అప్పటికి అలెక్స్ క్రీజ్‌లో చేరుకున్నప్పటికీ, అబ్‌స్ట్రక్టింగ్ అవుట్ అంటూ థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఫలితంగా బీబీఎల్‌లో ఈ తరహాలో అవుటైన తొలి బ్యాట్స్‌మన్‌గా అలెక్స్ నిలిచాడు.
కాగా, ఈ అవుట్‌పై ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధ్వజమెత్తాడు. అలెక్స్ ఉద్దేశపూర్వకంగా బంతిని ఆపడం ద్వారా అవుట్‌గా ఎలా పరిగణిస్తారంటూ విమర్శించాడు. ఈ నాటకీయపరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. తన దృష్టిలో ఇది కచ్చితంగా అబ్‌స్ట్రక్టింగ్ అవుట్ కాదంటూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment