
రిక్‌జావిక్ (ఐస్‌లాండ్): గతేడాది యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తమ క్వార్టర్ ఫైనల్ ప్రదర్శన గాలివాటమేమీ కాదని ఐస్‌లాండ్ జట్టు నిరూపించింది. కేవలం 3 లక్షల 30 వేల జనాభా ఉన్న ఈ చిన్న యూరోప్ దేశం వచ్చే ఏడాది రష్యాలో జరిగే ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. యూరోప్ జోన్‌లో భాగంగా జరిగిన తమ చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఐస్‌లాండ్ 2–0తో కొసావో జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది.
ఆరు జట్లు ఉన్న గ్రూప్–1లో ఐస్‌లాండ్ 10 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలు, ఒక ‘డ్రా’, రెండు పరాజయాలతో మొత్తం 22 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్‌కు అర్హత పొందిన అతి చిన్న దేశంగా (జనాభా పరంగా) ఐస్‌లాండ్ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ ఘనత ట్రినిడాడ్ అండ్ టొబాగో (2006–కోటి 30 లక్షల జనాభా) పేరిట ఉండేది. వచ్చే ఏడాది జూన్ 14 నుంచి జూలై 15 వరకు రష్యాలో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటాయి. ఇప్పటివరకు ఆతిథ్య రష్యా జట్టుతో కలిపి 17 జట్లు అర్హత సాధించగా... నవంబర్ 14వ తేదీతో మిగతా 15 జట్లు ఖాయమవుతాయి.