
యువరాజ్‌కు పరీక్ష
బెంగళూరు: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చాలా రోజుల తర్వాత క్రికెట్ మైదానంలో కనిపించనున్నాడు. వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో నేటి (ఆదివారం) నుంచి బెంగళూరులో జరిగే మూడు వన్డేల అనధికారిక సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు తలపడుతుంది. ఇటీవలే న్యూజిలాండ్ ‘ఎ’ జట్టును 3-0తో ఓడించిన భారత ‘ఎ’ జట్టు ఇప్పుడు యువరాజ్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది.
జాతీయ జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న యువీ ఎలా రాణిస్తాడనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. టెస్టుల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయినా వన్డే ఫార్మాట్‌లో యువరాజ్‌కు తిరుగులేదు. క్యాన్సర్ బారిన పడి పూర్తిగా కోలుకున్న యువీ ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ వన్డే సిరీస్‌లో రాణించి తిరిగి జాతీయ సెలక్టర్ల నమ్మకాన్ని పొందడం ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఆవశ్యకం. జట్టులో యువీతో పాటు ఫామ్‌లో ఉన్న ఉన్ముక్త్ చంద్, రాబిన్ ఉతప్ప మరోసారి సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ జోడి కివీస్ ‘ఎ’పై అదరగొట్టింది. ఉతప్ప కూడా నిలకడగా రాణించి నవంబరులో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు. ఈ జోడి మరోసారి శుభారంభాన్ని అందిస్తే మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్, మన్‌దీప్ సింగ్, యువీ చెలరేగేందుకు సిద్ధంగా ఉంటారు. పేలవ ఫామ్‌తో రెండేళ్ల నుంచి జట్టులో లేకుండా పోయిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్ కూడా ఈ అవకాశాన్ని వదులుకోరాదని చూస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఇర్ఫాన్ పఠాన్, ప్రవీణ్ కుమార్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్‌లకు చోటు కల్పించారు.
మరోవైపు యువకులతో కూడిన విండీస్ ‘ఎ’ జట్టు శాయశక్తులా పోరాడేందుకు సిద్ధమవుతోంది. కీరన్ పావెల్ నేతృత్వంలోని ఈ జట్టు ఆటగాళ్లు మెరుగ్గా ఆడి వచ్చే నెలలో భారత్‌కు రానున్న విండీస్ సీనియర్ జట్టులో బెర్త్ దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. పలువురు ఆటగాళ్లకు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండడం కలిసొచ్చే అంశం. ఇదిలావుండగా ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం ప్రేక్షకులను ఉచితంగా అనుమతించనున్నట్టు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
జట్లు: భారత్ ‘ఎ’: యువరాజ్ (కెప్టెన్), ఉన్ముక్త్, ఉతప్ప, అపరాజిత్, జాదవ్, నమన్ ఓజా, యూసుఫ్, ఉనాద్కట్, వినయ్, సిద్ధార్థ్ కౌల్, నర్వాల్, నదీమ్, మన్ దీప్ సింగ్, రాహుల్ శర్మ.
విండీస్ ‘ఎ’: పావెల్ (కెప్టెన్), పెరుమాల్, బీటన్, బానర్, కార్టర్, కోట్రెల్, కమ్మిన్స్, డియోనరైన్, మిల్లర్, నర్స్, రస్సెల్, థామస్.