ఒక్క మ్యాచ్.. లక్ష ఉద్వేగాలు!
ఒక్క మ్యాచ్.. లక్ష ఉద్వేగాల సంగమం. అసలైన టీ20 మజా ఎలా ఉంటుందో బెంగళూరులో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ నిరూపించింది. చివరిబంతి వరకు ఉత్కంఠ.. బంతి బంతికి మారుతున్న సమీకరణలు. హోరాహోరీగా గెలుపుకోసం ఇరుజట్ల ప్రయత్నం.. మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది.
బెంగళూరు టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లది అద్భుతమైన పోరాటపటిమే. కానీ తేడా ఒక్కటే. అది మహేంద్రసింగ్ ధోనీ. ఓడిపోయే మ్యాచ్ ధోనీ వల్లే భారత్‌ను వరించింది. టీ20 వరల్డ్ కప్ సెమిస్ ఆశలను నిలిపింది. బంగ్లాదేశ్‌కు అద్భుతమైన విజయాన్ని దూరం చేసింది. ఒక క్రికెట్ జట్టుకు సారథిగా ముందుండి నడిపించడం.. రాకెట్ సైన్స్ కాకపోవచ్చు. కానీ గెలుపు నిర్దేశించే మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి మాత్రం ఫిజిక్స్ కూడా అవసరమేనని ఈ మ్యాచ్ ద్వారా ధోనీ నిరూపించాడు. ఆద్యంతం గెలుపు దోబుచులాడిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ఎంతో ఉద్వేగాన్ని, మరెంతో ఉత్కంఠను కలిగింది. ఈ మ్యాచ్‌లో ఐదు కీలక పరిణామాలివి..
ఇండియా ఓపెనింగ్ భాగస్వామ్యం!
ఇటీవల మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్, శిఖర్ ధావన్ జోడీ ఈ మ్యాచ్‌లో మాత్రం నిలబడింది. ఆరు ఓవర్లు ఆడి 42 పరుగుల భాగ్వస్వామ్యంతో తొలి వికెట్ కు ఒక రకంగా శుభారంభాన్నిచ్చింది. ఈ ఇద్దరు ఓపెనర్లు ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో తలో సిక్స్ బాదారు. ఇద్దరూ వెంటవెంటనే ఔటైనప్పటికీ భారత్‌కు మాత్రం మంచి ప్లాట్‌ఫామ్ ఇచ్చారని చెప్పాలి.
స్లాగ్ ఓవర్లలో ఇండియా బ్యాటింగ్
13 ఓవర్లలో భారత్ స్కోరు 84/2. ఈ దశలో 150 వరకు పరుగులు చేయడం చాలా కష్టంగా తోచింది. ఈ సమయంలో హార్థిక్ పాండ్యాను ముందుగా పంపడం బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. రెండు భారీ సిక్స్‌లతో జట్టు స్కోరు పరుగులు పెట్టడానికి పాండ్యా దోహదం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ధోనీ (12 బంతుల్లో 13 పరుగులు), రవిచంద్రన్ అశ్విన్ (8 బంతుల్లో 12 పరుగులు) వేగంగానే స్కోరు చేయడంతో భారత్ గౌరవప్రదమైన 146 పరుగులు చేయగలిగింది.
తమిమ్ ఇక్బాల్ వికెట్
తమిమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్‌కు చాలా స్థిరమైన, నమ్మదగిన బ్యాట్స్‌మెన్. టీ20 వరల్డ్‌కప్‌లోనూ అతను అదే విషయాన్ని నిరూపించాడు. 31 బంతుల్లో 35 పరుగులతో బంగ్లాదేశ్ లక్షఛేదనకు అతడు బలమైన పునాది వేశాడు. ఇక్బాల్ ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో జడ్డేజా బౌలింగ్‌లో ధోనీ అతన్ని స్టంపౌట్ చేయడం భారత్‌కు మేలు చేసింది. మ్యాచ్ బంగ్లా చేతుల నుంచి కొద్దికొద్దిగా భారత్ వైపు మొగ్గడం అక్కడే కనిపించింది.
బుమ్రా పొదుపైన బౌలింగ్
పొదుపుగా బౌలింగ్ చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న యువ బౌలర్ బుమ్రా. బంగ్లా మ్యాచ్‌లోనూ బుమ్రా ఇదే విషయాన్ని మళ్లీ ప్రూవ్ చేశాడు. కీలక సమయంలో 19వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌పై ఆశలు పెట్టుకోవడానికి ఈ ఓవర్ ఎంతగానో టీమిండియాకు దోహదం చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచింది.
మిరాకిల్.. లాస్ట్ ఓవర్!
హార్థిక్ పాండ్యా విసిరిన చివరి ఓవర్ ఓ అద్భుతం. ఓ మిరాకిల్. లాస్ట్ ఓవర్‌లో బంగ్లా విజయానికి 11 పరుగులు కావాలి. మొదటి బంతికి మహమ్మదుల్లా ఒక పరుగు తీశాడు. ఆ వెంటనే రెండో బంతికి ముష్ఫికర్ ఓ ఫోర్ కొట్టాడు. ఇక బంగ్లా గెలుపు లాంఛనమేనని అంతా అనుకున్నారు. మైదానం నిండా నిశ్శబ్దం. మళ్లీ పాండ్యా బంతిని ఎదుర్కొన్న ముష్ఫికర్ మరో ఫోర్‌తో జట్టును గెలుపు తీరానికి చేరువగా తీసుకొచ్చాడు. అయితే నాలుగో బంతికి పాండ్యా అద్భుతం చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ముష్ఫికర్ డీప్ మిడ్‌వికెట్‌లో ధావన్‌కు దొరికిపోయాడు. బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాలి. గెలుపు ఇరు జట్ల మధ్య ఊగిసలాడుతుండగా ఐదో బంతికి మహమ్మదుల్లా వికెట్‌ను పడగొట్టాడు. చివరి బంతి ఔట్‌సైడ్ దిశగా షార్ట్‌బాల్ వేశాడు. బంతి బ్యాటుకు తగలలేదు. అయినా బ్యాట్స్‌మెన్ సింగిల్‌కు ప్రయత్నించాడు. మెరుపువేగంతో దూసుకొచ్చిన ధోనీ వికెట్‌ను గిరాటేసి రన్నౌట్ చేయడంతో భారత్‌కు ఊహించని విజయం దక్కింది. ఉద్వేగభరితమైన ఆనందంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది.