సాక్షి క్రీడావిభాగం
కోట్లాది అభిమానులను తన అసమాన ఆటతీరుతో ఉర్రూతలూగించి... క్రికెట్‌ను దేశంలో ఓ మతంగా మార్చిన క్రికెటర్ ఇక చివరి మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ తర్వాత ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే మాస్టర్‌ను ఎంతగానో ఆరాధించిన అభిమానులు ఆవేదన చెందారనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే రిటైర్‌మెంట్ ప్రకటన (అక్టోబర్ 11) వచ్చిన నాటి నుంచి సచిన్ ఆడబోయే మ్యాచ్‌ల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. మధ్యలో ఆడిన రంజీ మ్యాచ్‌నూ చూసి సంబరపడ్డారు. ఇక అసలైన రోజు రానే వచ్చింది. ఆడేది కేవలం రెండు టెస్టులే. తొలి మ్యాచ్ నేటి నుంచి ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతుంది.
ఓ క్రికెటర్‌గా సచిన్ కోల్‌కతా రావడం ఇదే చివరిసారనే భావన అక్కడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు దేశంలోని మిగిలిన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలయ్యే వరకూ కోట్లాదిమంది టెన్షన్ తగ్గదేమో..! అద్భుతమైన ఆటతీరుతో ఇంతకాలం అలరించిన మాస్టర్... తన కెరీర్‌ను తన స్థాయికి తగ్గట్లుగా ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు. సెంచరీ చేసి గాల్లోకి బ్యాట్‌ను చూపించే తన ట్రేడ్‌మార్క్ ఫోజును చూడాలని ఉబలాటపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో లేదంటే ముంబైలో... ఎక్కడైనా ఫర్లేదు. సచిన్ ఒక్క సెంచరీ అయినా చేయాలి.
చాలామంది గొప్ప క్రికెటర్లు తమ చివరి సిరీస్‌ను అద్భుతంగా ముగించారు. వెస్టిండీస్ దిగ్గజం రిచర్డ్స్‌ను సచిన్ బాగా ఇష్టపడతాడు. రిచర్డ్స్ తన చివరి సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఎనిమిది ఇన్నింగ్స్‌లో ఐదు అర్ధసెంచరీలు చేసి సిరీస్‌ను ఘనంగా ముగించాడు. అదే విధంగా మంచి కెప్టెన్‌గా మాస్టర్ నుంచి కితాబు అందుకున్న స్టీవ్‌వా కూడా తన చివరి సిరీస్‌లో 44.50 సగటుతో 267 పరుగులు చేశాడు. వీళ్ల తరహాలోనే సచిన్ కూడా తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకోవడం ఓ సగటు అభిమాని కోరికే కాదు... హక్కు కూడా..!
ఎన్నో జ్ఞాపకాలు
సచిన్ తొలిసారి 1991 జనవరి 4న శ్రీలంకతో వన్డేలో ఈడెన్‌గార్డెన్స్‌లో తొలిసారి బరిలోకి దిగాడు. అప్పటి నుంచి ఈ ప్రఖ్యాత స్టేడియంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. 1993లో తన సంచలన బౌలింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు... 1996 ప్రపంచకప్‌లో అల్లరినీ దగ్గర్నించి చూశాడు.మార్చి 2012లో బంగ్లాదేశ్‌పై వన్డే సెంచరీ తర్వాత మళ్లీ సచిన్ శతకం చేయలేదు. మరోవైపు టెస్టుల్లో 51 శతకాలు సాధించిన సచిన్... 2011లో దక్షిణాఫ్రికాలో సెంచరీ చేశాక మళ్లీ మూడంకెల స్కోరు చేయలేదు. కాబట్టి మాస్టర్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాలి. ఈడెన్‌లో మాస్టర్‌కు గొప్ప రికార్డేమీ లేదు.
లక్ష్మణ్ (10 టెస్టుల్లో ఐదు సెంచరీలు), అజహరుద్దీన్ (7 మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు), రాహుల్ ద్రవిడ్ (9 టెస్టుల్లో మూడు సెంచరీలు)లకు ఇది అచ్చొచ్చిన మైదానం. సచిన్ ఇక్కడ ఆడిన 20 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు మాత్రమే సాధించాడు. రికార్డులు ఎలా ఉన్నా... ఇక తను ఇక్కడ ఆడేది ఇదే ఆఖరు. కాబట్టి మంచి స్కోరునే సాధించి అందరినీ అలరించాలని ఆశిద్దాం.
ఘనంగా ముగించాలి
Published Wed, Nov 6 2013 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement