
నేడు ఇరాన్‌తో భారత్ పోరు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ
టెహ్రాన్: ఇప్పటికే 2018 ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత ఫుట్‌బాల్ జట్టు గురువారం నామమాత్రమైన ఆసియా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఆసియా నంబర్‌వన్ ఇరాన్ జట్టుతో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 160వ స్థానంలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ సునీల్ చెత్రి లేకుండానే బరిలోకి దిగనుంది. గాయం కారణంగా సునీల్ చెత్రి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జెజె లాల్‌పెకులువా భారత్‌కు సారథ్యం వహిస్తాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న ఇరాన్ గ్రూప్ ‘డి’లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకొని 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక దాంట్లో గెలిచి, ఐదింటిలో ఓడిపోయి మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 1959లో చివరిసారి ఇరాన్‌పై గెలిచిన భారత్ ఆ తర్వాత ఈ జట్టుపై గెలవలేదు.