
వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు
ముంబై : చివరి రెండు వన్డేలకు సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి ఎందుకు విశ్రాంతినిచ్చారని టీమిండియా మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ప్రశ్నించారు. ధోని లేకపోవడం వల్లే మొహాలీ వన్డేలో భారత్ భారీ స్కోర్‌ను కాపాడుకోలేక ఓటమిపాలైందని అభిప్రాయపడ్డారు. ధోని లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందని, వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు ఈ మ్యాచ్‌లో మిస్సయ్యాయని, కోహ్లి కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని పీటీఐతో పేర్కొన్నారు.
‘నేనెవరిపై కామెంట్ చేయదల్చుకోలేదు.. కానీ ధోనికి విశ్రాంతినివ్వడమే ఆశ్చర్యానికి గురిచేసింది. కీపర్‌గా, బ్యాట్స్‌మెన్, దాదాపు సారథిగా అతని సేవలు జట్టు కోల్పోయింది. ధోని యువకుడు కాకపోవచ్చు. కానీ అతను జట్టుకు అవసరం. అతను ప్రశాంతంగా ఆటగాళ్లను ప్రభావితం చేయగలడు. ప్రస్తుత సారథికి కూడా అతని సూచనలు అవసరం. అతను లేక కోహ్లి మొరటుగా కనిపించాడు. ప్రపంచకప్ ముందు జట్టులో ప్రయోగాలు అనవసరం. ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. కేవలం ఆట ఆడితే చాలు. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌తో మరిన్ని సమస్యలు రానున్నాయి. ఐపీఎల్‌లో ఏ ఆటగాడైన గాయపడవచ్చు. అలా అని వారు 100 శాతం ఆడుతారని కూడా మనం విశ్వసించలేం’ అని వ్యాఖ్యానించారు. కుల్దీప్, చహల్‌లు కూడా సీజన్ ఫ్లేవర్‌లాంటి స్పిన్నర్లని, జడేజా, అశ్విన్‌లకు తుది జట్టులో అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు ఈ మాజీ స్పిన్నర్ తెలిపారు.