
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో సాగిన 16 ఏళ్ల కెరీర్‌లో స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. జెంటిల్‌మన్ క్రికెటర్‌గానే ఆటను ముగించాడు. ఇప్పుడు లక్ష్మణ్ కెరీర్, విజయాలు, వైఫల్యాలు, వ్యక్తిగత అంశాలతో అతని ఆత్మ కథ అందుబాటులోకి వస్తోంది. ‘281 అండ్ బియాండ్’ పేరుతో వస్తున్న ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. సీనియర్ క్రీడా పాత్రికేయుడు ఆర్. కౌశిక్ సహ రచయితగా ఉన్న ఈ పుస్తకాన్ని వెస్ట్‌లాండ్ పబ్లికేషన్స్ ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో తన పుస్తకం విశేషాల గురించి లక్ష్మణ్ మాట్లాడాడు. పుస్తకాన్ని సంచలనంగా మార్చేందుకు ఎలాంటి మసాలాలు దట్టించలేదని అతను అన్నాడు. చాలా ఆత్మ కథల తరహాలో పనిగట్టుకొని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయలేదని వీవీఎస్ చెప్పాడు. ‘నా పుస్తకంలో కావాలని చొప్పించిన వివాదాస్పద అంశాలు ఏవీ ఉండవు. అయితే ఇందులో ప్రతీ అక్షరం నిజాయితీగా రాశానని చెప్పగలను.
అయితే నాడు స్పందించలేకపోయిన కొన్ని సందర్భాల గురించి మాత్రమే స్పష్టంగా ప్రస్తావించాను. 2000లో ముంబైలో దక్షిణాఫ్రికాతో టెస్టు తర్వాత నన్ను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించడం, ఇకపై ఓపెనర్‌గా ఆడనంటూ కచ్చితంగా చెప్పేసిన విషయం, 2003 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై నేను పడిన వేదనలాంటివి ఇందులో ఉన్నాయి. వివాదం అనే మాటను వాడను కానీ నా మనసులో అనుకున్న విషయాలు మాత్రం నిజాయితీగా వెల్లడిస్తున్నాను’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. చిన్నప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం నుంచి రిటైర్మెంట్ వరకు అనేక ఆసక్తికర అంశాలతో పాటు రిటైర్మెంట్ తర్వాతి జీవితం, కుటుంబం తదితర విశేషాలు ఇందులో ఉన్నాయని అతను వెల్లడించాడు. కేవలం క్రికెటర్లకే కాకుండా... చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రులకు కూడా తన అనుభవాలు ఉపయోగపడతాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. వీవీఎస్ లక్ష్మణ్ అనగానే అందరికీ కోల్‌కతా 281 ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది కాబట్టి దానిని టైటిల్‌గా పెట్టామని వీవీఎస్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment