గౌరవంగా తప్పుకోండి | Former players want Duncan Fletcher out, question MS Dhoni's captaincy | Sakshi
Sakshi News home page

గౌరవంగా తప్పుకోండి

Published Tue, Aug 19 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

గౌరవంగా తప్పుకోండి

గౌరవంగా తప్పుకోండి

ధోని, ఫ్లెచర్ లపై మాజీల ధ్వజం

ముంబై: ఇంగ్లండ్‌లో భారత జట్టు చెత్త ప్రదర్శనను సగటు అభిమానితో పాటు మాజీ క్రికెటర్లు, సారథులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ ధోని చెత్త సారథ్యం, కోచ్ ఫ్లెచర్ చేతకానితనంతో పాటు జట్టు సహాయక సిబ్బంది పూర్తిగా నామమాత్రంగా మారారనే విమర్శలు వచ్చాయి. బోర్డు చొరవ తీసుకుని వీళ్లందరినీ తప్పించేకంటే ముందే... వీళ్లే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు వెలిబుచ్చారు.
 
‘తుది జట్టు ఎంపిక, మైదానంలో వ్యూహాలు, ఫీల్డర్ల మోహరింపు... ఇలా ధోని అన్ని చోట్లా తప్పులు చేశాడు. ఇక ఫ్లెచర్ గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం. కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది కూడా వెంటనే తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది’             
 -వెంగ్‌సర్కార్.
 
‘భారత ఆటగాళ్లలో కొందరికి ఏమాత్రం కష్టపడే తత్వం లేదు. అసలు తమ లోపాలను సరిదిద్దుకునేందుకు నెట్స్‌లో కాస్త ఎక్కువ సమయం గడపాలనే ఆలోచన కూడా వారికి ఉండదు. ప్రత్యర్థి జట్టు పట్టిష్టమైన దైనా మన ఆటగాళ్లు కనీసం పోరాడాలి కదా. టెస్టుఆడే దమ్ములేని వారు తప్పుకోవడమే ఉత్తమం’              
- సునీల్ గవాస్కర్
 
‘లార్డ్స్‌లో విజయం తర్వాత ఫ్లెచర్ చేసిందేమిటి. ఆధిక్యం కొనసాగించాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. కచ్చితంగా ఫ్లెచర్‌ను తప్పించాల్సిందే. ఇక ధోని బ్యాట్స్‌మన్‌గా ఫర్వాలేదనిపించినా... కెప్టెన్‌గా ఘోరంగా విఫలమయ్యాడు’
- అజిత్ వాడేకర్
 
‘ధోని తన ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఏదో అద్భుతం జరుగుతుందని వేచి చూశాడు. కానీ మైదానంలో ప్రతిసారీ అద్భుతాలు జరగవని తెలుసుకోవాలి. టెస్టు కెప్టెన్‌గా ధోని సమయం ముగిసిందనే అనుకుంటున్నాను’         
 - గుండప్ప విశ్వనాథ్

‘ఇప్పటివరకూ ఫ్లెచర్ భారత జట్టుకు చేసిన మేలు ఏమీ లేదు. ఇంకా తనని కొనసాగించడం వల్ల సమయం వృథానే. బోర్డు తప్పిస్తుందో... లేక అతనే గౌరవంగా రాజీనామా చేస్తారో చూడాలి’     
- శ్రీకాంత్
 
‘బీసీసీఐ అధికారిగానే కాకుండా లక్షలాది అభిమానుల్లో ఒకడిగా ఇంగ్లండ్ పర్యటనలో భారత ఆటతీరుకు బాధపడుతున్నాను. విజయాల దారి పట్టేందుకు కొంత ఆత్మపరిశీలన అవసరమని నా అభిప్రాయం. విదేశాల్లో బాగా రాణించిన మాజీ ఆటగాళ్లున్నారు. వారిలో ఒకరు కోచ్‌తో కలిసి పనిచేస్తే ఫలితం ఉండొచ్చు. తను కోచ్‌కు ఆటగాళ్లకు మధ్య వారధిలా పనిచేయగలడు’ - అనురాగ్ ఠాకూర్ (బీసీసీఐ సంయుక్త కార్యదర్శి)
 
...కారణాలు అనేకం

ఇంగ్లండ్‌లో భారత్ ఓటమిని విశ్లేషించడం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడంలాంటిదే! ఒకటా... రెండా... ఓటమికి కారణాలు చెప్పడం అంతులేని కథ! మూడేళ్ల క్రితం 0-4తో ఓడినప్పుడు కూడా ఇంత ఘోరంగా ఆడలేదు.  నాడు ఒక్కసారి మాత్రమే జట్టు 200 లోపు పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ఆ చెడ్డ ఘనత ఐదు సార్లు సాధించింది.

ఈ సారి మన యువ తరంగాల నుంచి అద్భుతాలు ఆశించకపోయినా...పోరాటతత్వం ప్రదర్శిస్తారని, భారత టెస్టు భవిష్యత్తుకు దిక్సూచీ అవుతారని అనుకున్నాం. మరో వైపు ఇంగ్లండ్ బలహీనంగా కనిపించింది. కానీ భారత ఆటగాళ్లంతా సమష్టి వైఫల్యంతో అభిమానుల ఆశను వమ్ము చేశారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు...ఈ ఘోర వైఫల్యానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మచ్చుకు తొమ్మిది కారణాలను పరిశీలిస్తే... - సాక్షి క్రీడావిభాగం

 
1 కుక్ క్యాచ్ వదిలేసిన జడేజా: సరిగ్గా చెప్పాలంటే సిరీస్‌కు ఇదే టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు. చాలా కాలంగా ఫామ్‌లో లేకుండా ఇబ్బంది పడుతూ, తప్పుకోవాలంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్‌కు మూడో టెస్టులో 15 పరుగుల వద్ద స్లిప్స్‌లో జడేజా ప్రాణదానం చేశాడు. ఫలితంగా ఈ ఇన్నింగ్స్‌లో చేసిన 95 పరుగులతో ఆత్మవిశ్వాసం పెరిగిన కుక్, సిరీస్ ఆసాంతం దానిని కొనసాగించాడు.
 
2 జడేజా-అండర్సన్ గొడవ: తిట్టాడా...తోసేశాడా తర్వాతి సంగతి! అండర్సన్‌దే తప్పు అని కచ్చితంగా నిర్ధారించుకున్న ధోని సేన జడేజాకు మద్దతు పలికే క్రమంలో ఈ ఘటనపై తీవ్రంగా దృష్టి పెట్టింది.  ఆటను వదిలి అనవసరపు అంశంపై ఎక్కువగా రాద్ధాంతం చేసింది. ఫలితంగా జట్టుపై దీని ప్రభావం కనిపించగా, చివరకు తీర్పు కూడా వ్యతిరేకంగా వచ్చింది. ధోని ఏం మాట్లాడినా అందులో 75 శాతం ఈ వివాదం గురించే చెప్పాడు. ఈ కేసుపై పెట్టిన శ్రద్ధ క్రికెట్‌పై పెడితే మూడో టెస్టు ఓడకపోయేవారని విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
3 రెండో ఓపెనర్: ఆరంభం సరిగ్గా లేకుండా టెస్టుల్లో ఏ జట్టూ మ్యాచ్ గెలవటం అంత సులువు కాదు. అయితే భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం పెద్ద సమస్యగా మారింది. విజయ్ ఫర్వాలేదనిపించినా...ధావన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత గంభీర్‌కు రెండు మ్యాచుల్లో అవకాశాలు ఇచ్చినా ఉపయోగపడింది లేదు.
 
4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఎక్కడ?: టెస్టుకు ముందు వార్మప్ గేమ్‌లు ఆడినంత మాత్రాన టెస్టులకు ఆ ప్రాక్టీస్ సరిపోదు. ఐదు రోజుల మ్యాచ్ ఆడాలంటే శారీరకంగా, మానసికంగా కూడా ఆటగాళ్లకు సన్నద్ధత అవసరం. మన ఆటగాళ్లు దేశవాళీలోనూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడేది చాలా తక్కువ. నిర్ణీత సమయపు బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కే పరిమితమయ్యే అలవాటు ఎప్పటినుంచో ఉంది. అందుకే విజయ్, భువనేశ్వర్, రహానే లాంటి ఆటగాళ్లకు ఐదు టెస్టులు భారంగా అనిపించాయి. ఆరంభంలో జోష్‌లో కనిపించిన వీరు ఆ తర్వాత సత్తువ కోల్పోయారు.
 
5 మిడిలార్డర్ మిథ్య: అసలు భారత టెస్టు జట్టుకు మిడిలార్డర్ ఉందా అనిపించే విధంగా మన ప్రదర్శన సాగింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సూపర్ అనుకున్న పుజారా, ఇక మరో సచిన్‌గా భావించిన కోహ్లిల ఘోర వైఫల్యంతో జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముక లేకుండా పోయింది. లార్డ్స్ టెస్టు మినహా రహానే కనీసం పోరాటం కూడా చేయలేకపోయాడు.
 
స్లిప్ ఫీల్డింగ్: భారత వైఫల్యంలో స్లిప్ ఫీల్డర్లు కూడా పెద్ద పాత్రే పోషించారు! పట్టిన క్యాచ్‌లకంటే వదిలి పెట్టినవే ఎక్కువగా ఉన్నాయి. వారు వీరనే తేడా లేకుండా అంతా అక్కడ విఫలమయ్యారు. విజయ్, రహానే, కోహ్లి, ధావన్, అశ్విన్, జడేజా...ఎవరిని నిలబెట్టినా అంతా క్యాచ్‌లు వదిలారు.
 
7 స్పష్టత లేని బాధ్యత: ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లా...ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లా...ఇద్దరు స్పిన్నర్లా...ఇలాంటి సంశయం జట్టు మేనేజ్‌మెంట్‌లో సిరీస్ మొత్తం కొనసాగింది. ముఖ్యంగా జడేజా, అశ్విన్‌లను సమర్థంగా ఉపయోగించుకోవడంలో అంతా గందరగోళంగా కనిపించింది. అన్నింటికి మించి జట్టులో స్టువర్ట్ బిన్నీ ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.
 
8 క్రమశిక్షణ లేని బౌలింగ్: సిరీస్‌లో చివరి మూడు టెస్టుల్లో భారత్‌కు పట్టు దొరికే అవకాశం లభించినా మన బౌలర్లు కనీస స్థాయిలో కూడా రాణించలేకపోయారు. ఫలితంగా ఇంగ్లండ్‌ను రూట్‌లాంటి ఆటగాళ్లు పట్టుదలతో ఆడి గట్టెక్కించారు. భువనేశ్వర్ ఆరంభంలో చూపిన జోరు ఆ తర్వాత తగ్గింది. పంకజ్ సింగ్, షమీ, జడేజా విఫలం కాగా... ఇషాంత్  ప్రభావం చూపలేకపోయాడు.
 
9 ధోని తలపై బరువు: సమకాలీన క్రికెట్‌లో కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బ్యాటింగ్‌లో రాణించిన ఆటగాళ్లు చాలా తక్కువ మంది. కానీ ధోని చాలా వరకు తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు.  టెస్టు క్రికెట్‌కు కావాల్సిన టెక్నిక్ లేదనే విమర్శ ఉన్నా ఈ సిరీస్‌లో నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. అయితే అతనిపై భారం ఎక్కువైనట్లు కనిపించింది. ఎందుకంటే సాంప్రదాయ వ్యూహాలతో పాటు కొత్తగా, భిన్నంగా ప్రయత్నిస్తూ విజయవంతం అయిన ధోనికి ఏదీ కలిసి రాలేదు.
 
దేవుళ్లూ రక్షించలేదు
మనం కాస్త ప్రయత్నం చేస్తే భగవంతుడు కొంత అనుగ్రహం ప్రసాదిస్తాడేమో. కానీ భారత క్రికెట్ జట్టు ఆటను చూశాక దేవుడు కూడా సాయం చేయడు. ఓవల్ టెస్టుకు ముందు భారత జట్టు మసాజర్ రమేశ్ మానే... డ్రెస్సింగ్ రూమ్‌లో దేవుళ్ల ఫొటోలు పెట్టాడు. అలాగే గోడకు హనుమాన్ చాలీసాతో పాటు... భగవంతుడి గురించి మాటలు ఉన్న బోర్డులు తగిలించాడు. భారత క్రికెట్‌లో ఇలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ ఏం చేస్తాం..? ఇలాంటి ఆట ఆడితే భగవంతుడు మాత్రం ఎలా కరుణిస్తాడు..?
 
భారత జట్టుకు జరిమానా
అసలే ఘోర ఓటమితో తీవ్ర అవమానభారంతో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఆర్థికంగా కూడా దెబ్బతగిలింది. ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ధోని మ్యాచ్ ఫీజులో 60 శాతం, మిగిలిన భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 30 శాతం ఐసీసీ జరిమానా విధించింది. మరోసారి ధోని గనక రానున్న ఏడాది కాలంలో టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే... అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడే ప్రమాదం కూడా ఉంది.
 
ఐదో ర్యాంక్‌కు...
దుబాయ్: ఓవల్ టెస్టులో ఘోర పరాజయంతో భారత్ ఐసీసీ ర్యాంకుల్లో నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.   సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఈ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన శ్రీలంక 4వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా టాప్ ర్యాంక్‌లో ఉంది.
 
వాన్ ఓవర్ యాక్షన్!
లండన్: భారత జట్టు ఘోర పరాజయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. భారత్ కొత్త జెండా అంటూ ‘తెల్లజెండా’ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా భారత అభిమానులనూ రెచ్చగొట్టాడు. ‘మీ జట్టు బాగా ఆడలేదు. వాళ్లకు ఇంగ్లండ్‌లో గెలిచే సీన్ లేదని అంగీకరించండి’ అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అయితే తన విమర్శలు ఎలా ఉన్నా... సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ 3-1తో గెలుస్తుందని వాన్ జోస్యం చెప్పాడు. అటు ఇంగ్లండ్ మీడియా కూడా ధోనిసేన ఆటతీరుపై దుమ్మెత్తిపోసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement