ఇదైనా జరుగుతుందా?
క్రికెట్ జరిగితే సహజంగానే వివాదాలు వెనక్కుపోతాయి. ఆట లేకపోతే ఏదో ఒక అంశం గురించి చర్చ సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారత జట్టు తక్షణమే ఓ మ్యాచ్ ఆడాలి. లేదంటే ధోని వ్యాఖ్యల వివాదంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి వన్డేకి అడ్డుపడ్డ వరుణుడు... రెండో వన్డేలోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మ్యాచ్ పూర్తిగా జరగకపోవచ్చు.
కార్డిఫ్‌లోనూ వాన గండం
గెలుపు కోసం భారత్ ఎదురుచూపు
నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే
కార్డిఫ్: ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు మంగళ వారం భారత జట్టు మొత్తం తీవ్రంగా సాధన చేసింది. రవిశాస్త్రి, ఫ్లెచర్ సంయుక్త పర్యవేక్షణలో ఆటగాళ్లంతా చురుగ్గా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. టెస్టులను మరచి ఎలాగైనా వన్డే సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదల వారిలో కనిపించింది. తొలి వన్డేలో వరుణుడి కారణంగా ఎవరి సత్తా ఏమిటో బయటపడలేదు. దాంతో ఇప్పుడు మరో పోరాటం కోసం ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. నేడు (బుధవారం) ఇక్కడి సోఫియా గార్డెన్స్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ప్రయోగాలు ఉండకపోవచ్చు
రాబోయే ప్రపంచ కప్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లు గెలిస్తే జట్టు కూర్పుపై స్పష్టత వస్తుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సూచించారు. అయితే కనీసం ఇంగ్లండ్‌తో బుధవారం మ్యాచ్‌లో మాత్రం ఇప్పటికే స్థిరంగా ఉన్న లైనప్‌నే కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్, ధావన్‌లు ఆ తర్వాత కోహ్లి, రహానే, రైనాలు టాప్-5లో ఆడతారు. ధోని ఆరో స్థానంలో, ఆ తర్వాత ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లతోనే జట్టు ఉంటుంది.
ప్రాక్టీస్ సెషన్‌లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేసి కరణ్ శర్మ ఆకట్టుకున్నా... ఇప్పటికిప్పుడు అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవచ్చు. రాయుడుకి కూడా అవకాశం రావడం కష్టమే. అదే విధంగా ధోని అనూహ్య రీతిలో తప్పుకుంటే తప్ప సంజు శామ్సన్ కూడా ఇంగ్లండ్ టూర్‌కు పర్యాటకుడిగానే మిగిలిపోతాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు విఫలమైతే సిరీస్ తదుపరి దశలో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఇంగ్లండ్ ఏం చేయనుంది?
‘కుక్, బెల్, బ్యాలెన్స్‌లాంటి ఆటగాళ్లు వన్డేలకు పనికి రారు. వీరితో మా జట్టు ప్రపంచ కప్ గెలవలేదు. కుక్ అయితే వన్డే కెప్టెన్ కూడా కాదు’... భారత్‌తో కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు వాన్, స్వాన్ ఇలా తమ సొంత జట్టును విమర్శించడం ఒక్కసారిగా ఆ జట్టును ఇబ్బందుల్లో పడేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమ్‌లో ఉన్నారు. అయితే లార్డ్స్ పరాజయం తర్వాత ఇలా విమర్శించిన అందరికీ సమాధానం చెప్పిన తరహాలోనే వన్డేల్లోనూ నెగ్గి చూపించాలని కుక్ పట్టుదలగా ఉన్నాడు. అందు కోసం అతను తన జట్టులోని వన్డే స్పెషలిస్ట్‌లపై ఆధార పడ్డాడు. హేల్స్, మోర్గాన్, బట్లర్, గర్నీలాంటి ఆటగాళ్లకు ఇంగ్లండ్‌ను గెలిపించగల సామర్థ్యం ఉంది.
జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్.
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హేల్స్, బెల్, మోర్గాన్, రూట్, బట్లర్, స్టోక్స్, అండర్సన్, జోర్డాన్, గర్నీ, ట్రెడ్‌వెల్.
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ వికెట్. గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఈ మైదానంలో ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం బుధవారం కార్డిఫ్‌లో ఉదయం, మధ్యాహ్నం తర్వాత వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కాకపోయినా, మ్యాచ్‌కు ఏదో ఒక దశలో అంతరాయం కలగవచ్చు.