
మాస్కో: పసికూనపై పెద్దన్నదే పైచేయి. ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఫ్రాన్స్ ప్రపంచకప్‌ను రెండో సారి ముద్దాడింది. 1998లో ప్రస్తుత కోచ్ డైడర్ డెచాంప్స్ సారథ్యంలో తొలి సారి టైటిల్ గెలిచిన ఫ్రాన్స్.. మరోసారి లోరిస్ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచింది. ఆట ప్రారంభం నుంచి ఫ్రాన్స్ దూకుడుగా ఆడటంతో క్రొయేషియా ఒత్తిడిలో చిత్తయి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించింది. క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో తొలి గోల్ నమోదయింది. అనంతరం క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ పెరిసిచ్(28వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. ఆట 38వ నిమిషంలో పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఫ్రాన్స్ ఉపయోగించుకుంది. ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్ గ్రీజ్‌మన్ లెఫ్ట్ కార్నర్ నుంచి అద్బుతంగా గోల్ చేశాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సరికి 2-1తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది.
ద్వితీయార్థంలో ధాటిగా ఆడిన ఫ్రాన్స్, క్రొయేషియా రక్షణశ్రేణిని ఛేదించుకుంటూ గోల్ పోస్ట్‌లపై దాడి చేసింది. రెండో భాగంలో గోల్ చేయడానికి ఇరు జట్లు కష్టపడినా మరో గోల్ నమోదు కాలేదు. పోగ్బా 59వ నిమిషంలో మరో గోల్ నమోదు చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడు గోల్స్ నమోదయ్యాయి. క్రొయేషియాను అయోమయంలోకి నెట్టుతూ ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె 65వ నిమిషంలో మరో గోల్ చేశాడు. ఫ్రాన్స్ దూకుడుకు అడ్డుకట్టువేసేందుకు క్రోయేషియా అడ్డుకునే ప్రయత్నం చేసి సఫలమైంది. 69వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మన్‌జుకిచ్ గోల్ చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment