శభాష్‌.. బోపన్న | French Open win over 'Mixed' title | Sakshi
Sakshi News home page

శభాష్‌.. బోపన్న

Published Thu, Jun 8 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

శభాష్‌.. బోపన్న

శభాష్‌.. బోపన్న

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‘మిక్స్‌డ్‌’ టైటిల్‌ కైవసం
దబ్రోవ్‌స్కీతో కలసి చాంపియన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌
కెరీర్‌లో తొలిగ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌


పారిస్‌: భారత డబుల్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న కెరీర్‌లో అపూర్వ విజయం సాధించాడు. కెనడా క్రీడాకారిణి గాబ్రియేలా దబ్రోవ్‌స్కీతో కలసి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. బోపన్న కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.

పోరాడి నెగ్గిన బోపన్న జంట..
ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లో ఏడోసీడ్‌ బోపన్న జంట 2–6, 6–2, 12–10తో అన్నా లీనా గ్రోన్‌ఫెల్డ్‌(జర్మీనీ)– రాబెర్ట్‌ ఫరా (కొలంబియా)పై సంచలన విజయం సాధించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు మ్యాచ్‌పాయింట్లను కాచుకుని మరీ ఇండో–కెనడియన్‌ జంట విజేతగా నిలవడం విశేషం. కెరీర్‌లో రెండోగ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న బోపన్న.. మిక్సడ్‌లో మాత్రం తొలిసారే చాంపియన్‌గా నిలిచాడు. తొలిసెట్‌ ఆరంభ గేమ్‌ల్లో ఇరుజోడీలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకున్నారు. అయితే మూడోగేమ్‌లో బోపన్న జంట సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫరా జంట.. 2–1తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఏడోగేమ్‌లోనూ మరోసారి బోపన్న జంట సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 5–2తో ఆధిక్యంలో నిలిచింది. అదే జోరులో కేవలం 22 నిమిషాల్లో తొలిసెట్‌ను కైవసం చేసుకుంది. రెండోసెట్‌ ఆరంభంలోనూ బోపన్న జంట కుదరుకోలేదు.

మూడోగేమ్‌లో ప్రత్యర్థి దూకుడుగా ఆడడంతో బోపన్న జంట సర్వీస్‌ను కోల్పోయి 1–2తో వెనుకంజలో నిలిచింది. తర్వాతి గేమ్‌ నుంచి ఇండో–కెనడియన్‌ జంట తమ సిసలైన ఆటతీరును ప్రదర్శించింది. వరుసగా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసింది. సుదీర్ఘంగా సాగిన ఎనిమిదో గేమ్‌లో ఓ బ్రేక్‌ పాయింట్‌ అవకాశాన్ని చేజార్చుకున్న బోపన్న జంట.. వెంటనే దూకుడుగా ఆడి సెట్‌ను కైవసం చేసుకుంది. దీంతో 1–1 సెట్లతో మ్యాచ్‌ సమమైంది. ఈ క్రమంలో మ్యాచ్‌ సూపర్‌ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఈ సెట్‌ ఆరంభంలో 3–0తో ముందంజలో నిలిచిన ఇండో–కెనడియన్‌ జోడీ.. అనంతరం ఒత్తిడికి లోనైంది.

ఈ దశలో ప్రత్యర్థి పుంజుకుని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 5–3తో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలో బోపన్న జంట మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుసగా మూడు పాయింట్లు సాధించి 6–5తో ముందంజలో నిలిచింది. అనంతరం ఫరా జోడీ పుంజుకుని మరో మూడు పాయింట్లు సాధించడంతో 8–6తో మ్యాచ్‌ ఉత్కంఠస్థితిలో నిలిచింది. ఈ దశలో ఇరుజోడీలు తీవ్రంగా పోరాడడంతో మ్యాచ్‌లో ఆధిక్యం చాలాసార్లు మారుతూ వచ్చింది. చివరికి 10–10తో మ్యాచ్‌ సమంగా ఉన్న దశలో వరుసగా రెండుపాయింట్లు సాధించిన బోపన్న–దబ్రోవ్‌స్కీ జంట సెట్‌తోపాటు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement