‘రంజిం'పజేసేనా! | From today 82 Ranji Trophy | Sakshi
Sakshi News home page

‘రంజిం'పజేసేనా!

Published Wed, Sep 30 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

‘రంజిం'పజేసేనా!

‘రంజిం'పజేసేనా!

నేటి నుంచి 82వ రంజీ ట్రోఫీ    
బరిలో 27 జట్లు    
తొలి మ్యాచ్‌లలో ముంబైతో ఆంధ్ర, గోవాతో హైదరాబాద్ ‘ఢీ’

 
భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు వేళయింది. గత కొన్నేళ్లుగా స్టార్ క్రికెటర్లు దూరంగా ఉంటుండటంతో కాస్త కళ తప్పినట్లు కనిపించినా... దాని విలువ మాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చే కుర్రాళ్లు తమ సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇదే సరైన వేదిక. ఇక్కడ నిలబడగలగితే, నిలకడగా రాణిస్తే భవిష్యత్తుకు గట్టి పునాది అవుతుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ మెరుపులతో కొన్ని సార్లు వార్తల్లో నిలిచినా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ అయిన రంజీలో ప్రదర్శన లేకుండా ఎవరూ టీమిండియాకు ఎంపిక కాలేరనేది దిగ్గజాల అభిప్రాయం. ఇక పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్న సీనియర్లకూ ఇది మంచి అవకాశం.
 
క్రీడా విభాగం ; రంజీ ట్రోఫీ 2015-16 సీజన్‌కు అన్ని జట్లూ సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు గ్రూప్‌లలో కలిపి మొత్తం 27 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర ఎనిమిది జట్లతో లీగ్ మ్యాచ్‌లలో తలపడుతుంది. ‘ఎ’, ‘బి’ గ్రూప్‌లకు టోర్నీలో సమాన హోదా ఉండగా... ‘సి’ గ్రూప్‌లో మాత్రం చిన్న జట్లు ఉన్నాయి. తొలి రెండు గ్రూప్‌ల నుంచి మూడు జట్లు, చివరి గ్రూప్ నుంచి రెండు జట్లు కలిపి మొత్తం ఎనిమిది టీమ్‌లు క్వార్టర్ ఫైనల్ (నాకౌట్)కు అర్హత సాధిస్తాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 28 మధ్య ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. గ్రూప్ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు అర్హత పొందే జట్లు తర్వాతి ఏడాది పై గ్రూప్‌లకు ప్రమోట్ అవుతాయి. ఆ రెండు గ్రూప్‌లలో ఆఖరి స్థానంలో నిలిచిన టీమ్‌లు ‘సి’కి పడిపోతాయి. 1934-35 సీజన్‌లో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఇప్పటి వరకు 81 సార్లు జరిగింది. ఇందులో ముంబై (గతంలో బాంబే) ఏకంగా 40 సార్లు విజేతగా నిలవడం విశేషం.

 ఉత్సాహంగా ఆంధ్ర...
 చాలా కాలంగా గ్రూప్ ‘సి’కే పరిమితమవుతూ చిన్న జట్లతోనే పోటీ పడుతూ వచ్చిన ఆంధ్ర జట్టు గత ఏడాది అనూహ్యంగా పుంజుకుంది. చక్కటి ప్రదర్శనతో నాకౌట్‌కు అర్హత పొంది పై గ్రూప్‌లోకి ప్రమోట్ అయింది. ఫలితంగా ఈసారి బలమైన జట్లతో తలపడే అవకాశం లభించింది. దీని వల్ల ఆటగాళ్ల ప్రదర్శనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశం ఉంది. విజయనగరంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన ముంబైని ఆంధ్ర ఎదుర్కోనుంది. సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే జట్టు ఆత్మవిశ్వాసం అమితంగా పెరగడం ఖాయం. గత ఏడాదిలాగే మొహమ్మద్ కైఫ్ కెప్టెన్సీ, మార్గదర్శనంలో ఆంధ్ర ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలి.

 మళ్లీ మొదటి నుంచి హైదరాబాద్
 గత మూడేళ్లుగా పేలవంగా ఆడుతోన్న హైదరాబాద్ మరోసారి గ్రూప్ ‘సి’కే పరిమితమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఎక్కడా జట్టు నుంచి చెప్పుకోదగిన ప్రదర్శన రావడం లేదు. జట్టులో సభ్యులంతా ఫర్వాలేదనిపించే స్థాయిలో ‘ఏవరేజ్’ ఆటతోనే నెట్టుకొచ్చేస్తున్నారు తప్ప అద్భుతం అనిపించే ఆటతీరు కనబర్చలేకపోతున్నారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చే లేదా శాసించే తరహాలో ఒక గొప్ప ఇన్నింగ్స్ గానీ ఒక అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన గానీ హైదరాబాద్ ఆటగాళ్లు చూపించి చాన్నాళ్లయింది. దురదృష్టవశాత్తూ సొంత మైదానంలో కూడా హైదరాబాద్ గొప్పగా రాణించలేకపోతోంది. హనుమ విహారి నాయకత్వంలో ఈసారి అయినా మెరుగ్గా ఆడి పై గ్రూప్‌కు వెళ్లడమే ప్రస్తుతం హైదరాబాద్ లక్ష్యం. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్, గోవాతో తలపడుతుంది.  

 కర్ణాటకనే ఫేవరేట్...
 గత రెండు సీజన్‌లలో విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టింది. ముంబై తర్వాత అత్యధిక టైటిల్స్ (8) సాధించిన రికార్డు ఉన్న ఈ జట్టు వినయ్ కుమార్ నాయకత్వంలో ఈసారి కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. తమిళనాడు నుంచి ఆ జట్టుకు ప్రధానంగా పోటీ ఎదురుకావచ్చు. వీటితో పాటు బరోడా, పంజాబ్ కూడా పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది తమ సొంత జట్ల నుంచి ఇతర జట్లకు మారిన ఆటగాళ్లపై కూడా ప్రధానంగా దృష్టి నిలిచింది. వీరిలో తొలిసారి హర్యానా తరఫున బరిలోకి దిగుతున్న వీరేంద్ర సెహ్వాగ్ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ప్రజ్ఞాన్ ఓజా (బెంగాల్), వసీం జాఫర్ (విదర్భ), ఆర్పీ సింగ్ (గుజరాత్)లు కూడా తమ కొత్త జట్ల తరఫున రాణించాల్సి ఉంది.

జట్ల వివరాలు: గ్రూప్ ‘ఎ’: అస్సాం, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, విదర్భ, ఒడిషా.  గ్రూప్ ‘బి’: ఆంధ్ర, ముంబై, పంజాబ్, గుజరాత్, రైల్వేస్, తమిళనాడు, బరోడా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్.  గ్రూప్ ‘సి’: హైదరాబాద్, గోవా, జమ్మూ కాశ్మీర్, కేరళ, సౌరాష్ట్ర, త్రిపుర, సర్వీసెస్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్.
 
ఈసారి పాత నిబంధనలే...

రంజీ ట్రోఫీని ఆసక్తికరంగా మార్చేందుకు అనిల్ కుంబ్లే నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ పలు సూచనలు చేసింది. గత ఏడాది 108 లీగ్ మ్యాచ్‌లలో ఏకంగా 51 ‘డ్రా’గా ముగిశాయి. దాంతో జట్లు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం కాకుండా విజయం కోసం ఆడే విధంగా బోనస్ పాయింట్లను అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదం ఇవ్వాల్సి ఉండగా... గత నెల 28న జరిగిన ఆ సమావేశం అనూహ్యంగా వాయిదా పడింది. దాంతో పాత నిబంధనలతోనే ఈసారి కూడా టోర్నీ కొనసాగనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement