సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన దిగ్గజం!
మనీలా: బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను గడగడలాడించడంలోనే కాదు.. వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ తాను మేటి అనిపించుకున్నాడు బాక్సింగ్ మాజీ దిగ్గజం. ఎనిమిది సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన దిగ్గజం మానీ పాక్వియావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా హీనమైన వారని వ్యాఖ్యానించాడు. ఫిలిప్పీన్స్ సెనేట్ లో స్థానం కోసం పోటీపడుతున్న తరుణంలో ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెను దుమారం రేపాయి. ఈ మే నెలలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. భార్యతో పాటు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. తాను ఎవరిని విమర్శించడం లేదని, బైబిల్ లో పేర్కొన్న విషయాలనే తాను ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు తాను చేసిన పనిని తప్పు అని గ్రహించాడు. హోమో సెక్సువల్స్ ను దూషించినందుకు తనను క్షమించాలని కోరాడు.
'జంతువులు కూడా స్వలింగ సంపర్కం చేస్తాయి. అయినా అవే నయం. వాటికి ఆడా, మగా అనే తేడా అయినా ఉంది. పురుషులు- పురుషులతో, మహిళలు - మహిళలతో సెక్స్ లో పాల్గొనడం జంతువుల కంటే దారుణం' అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వైస్ గండా అనే ఓ గే ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. ట్విట్టర్లో ఆ బాక్సర్ పై విమర్శల వర్షం కురిపించాడు. పాక్వియావో తనకు తానుగా దేవుడు అని ఫీలవుతున్నాడు. కానీ, రాజకీయాలకు కావాలసింది నైపుణ్యం ఉన్నవాళ్లంటూ గండా మండిపడ్డాడు. ఇప్పటికీ తాను తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని.. ఎందుకంటే పవిత్ర బైబిల్ లో స్వలింగ సంపర్కం తప్పు అని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించాడు. దేవుడు మిమ్మల్ని అందర్నీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అని బాక్సర్ పాక్వియావో చెప్పుకొచ్చాడు.