అన్నీ మంచి శకునములే !
భారత క్రికెట్ పరిపాలనా వ్యవహారాల్లో శ్రీనివాసన్‌కు ఎదురులేదని మరోసారి రుజువు కాబోతోంది. మంగళవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశం ద్వారా చాలా అంశాల్లో స్పష్టత వచ్చింది. ఇక డిసెంబరులో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం లాంఛనమే కానుంది.
సాక్షి క్రీడావిభాగం
స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణ సందర్భంగా ముద్గల్ కమిటీ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు బెంచ్... ‘ఓ క్రికెటర్ తప్పు చేస్తున్నాడని శ్రీనివాసన్‌కు తెలిసినా ఆయన పట్టించుకోలేదు’ అని తెలిపింది. ఈ మొత్తం కేసుల విషయంలో ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ ఇదొక్కటే. బెట్టింగ్, ఫిక్సింగ్‌లతో ఆయనకు సంబంధం లేదని నివేదిక ద్వారా వెల్లడైంది.
అయితే ఉన్న ఒక చిన్న ఆరోపణ విషయంలో కూడా ఆయన దోషి కాదని బీసీసీఐ నిర్ధారించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన అంశం గురించి మంగళవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ వివరణ ఇచ్చారు.
అదేమిటంటే...
2010లో భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సమయంలో బిస్వాల్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ పర్యటనలో ఒక భారత క్రికెటర్ (ముద్గల్ కమిటీలో ఈ క్రికెటర్ నంబర్ 3, చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు) తన హోటల్ రూమ్‌లో నిద్రపోకుండా ఒక మహిళతో బయట తిరుగుతూ కనిపించాడు. ఈ విషయాన్ని బిస్వాల్ అప్పుడే బోర్డుకు తెలిపారు. అప్పుడు శశాంక్ మనోహర్ బోర్డు అధ్యక్షుడు, శ్రీనివాసన్ కార్యదర్శి. వీరిద్దరితో పాటు రాజీవ్ శుక్లాకు కూడా ఈ విషయం చెప్పారు.
దీంతో అప్పటి అధ్యక్షుడు మనోహర్ స్పందించి... ఆ క్రికెటర్‌ను గట్టిగా హెచ్చరించాలని బిస్వాల్‌కు సూచించారు. ఈ వ్యవహారంలో అధ్యక్షుడు చర్యలు తీసుకున్నందున నాటి కార్యదర్శి శ్రీనివాసన్ ఏమీ మాట్లాడలేదు. ముద్గల్ కమిటీ కూడా ఆ అంశాన్నే ప్రస్తావించిందని వర్కింగ్ కమిటీలో స్పష్టత వచ్చింది.
ఫిక్సింగ్ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళతారు. కాబట్టి శ్రీనివాసన్‌కు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రావని వర్కింగ్ కమిటీ భావిస్తోంది.
ఈస్ట్‌జోన్‌లో కీలకమైన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా, శ్రీనివాసన్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. తొలుత కాస్త వెనుకడుగు వేసినా శ్రీని తప్పులేదని వర్కింగ్ కమిటీ తేల్చడంతో అండగా నిలిచేందుకు దాల్మియా ముందుకొచ్చారు.
ఈ జోన్‌లోని ఆరు యూనిట్లు కూడా శ్రీనివాసన్‌కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ డిసెంబర్ 17న జరిగే ఏజీఎమ్‌లో ఆయన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నాయి. దీంతో అధ్యక్ష పదవి ఆశిస్తున్న శరద్ పవార్‌కు దాదాపుగా అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లే.
ఏజీఎమ్‌లో పవార్ వెనక్కి తగ్గినా.. అప్పటికప్పుడు కొత్త వ్యక్తి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు లేవు. ఈస్ట్‌జోన్ మొత్తం శ్రీనివాసన్ వెంటే ఉంది. కాబట్టి ఆయన మూడోసారి బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి లైన్ క్లియర్ అయినట్లే.
మూడు సంఘాలపై చర్యలు!
బీసీసీఐ ఎన్నికల అనంతరం మూడు సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బోర్డుకు అయిన కోర్టు ఖర్చులన్నీ ముంబై, పంజాబ్, విదర్భ సంఘాల నుంచి రాబట్టాలని భావిస్తున్నారు. గుర్తింపు లేని బీహార్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఆదిత్య వర్మ కోర్టులో కేసు దాఖలు చేస్తే... ఈ మూడు సంఘాలకు సంబంధించిన అధికారులు వర్మకు అండగా నిలవడం వల్లే చర్యలు తీసుకుంటున్నారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక నుంచి ముంబైలో మ్యాచ్‌లు ఎంసీఏకి ఇవ్వకుండా... సీసీఐకి ఇచ్చి, బ్రబౌర్న్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది.