
అరంగేట్రమే అదుర్స్ అనిపించాడు!
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ తరఫున హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేశాడు.
ధర్మశాల: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ తరఫున హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేశాడు. అందులో విశేషం ఏముందంటారా.. అరంగేట్ర మ్యాచ్ అయినప్పటికీ వన్డేల్లో పటిష్టమైన కివీస్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. వన్డేల్లో తాను రంగప్రవేశం చేసిన తొలి మ్యాచ్ లోనే అద్బుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో వన్డేల్లో ఈ ఫీట్ నమోదు చేసిన భారత నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో క.ఎల్ రాహుల్, మోహిత్ శర్మ, సందీప్ పాటిల్ మాత్రమే వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ లో అదరగొట్టే ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించారు.
తాను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన బౌలర్ గానూ నిలిచిన పాండ్యా మాట్లాడుతూ.. మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. ఆస్ట్రేలియా పిచ్ లపై, దేశవాలీ లీగ్స్, ఇతర మ్యాచులలో బౌలింగ్ చేసిన అనుభవం కలిసొచ్చిందన్నాడు. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 3/31 తో రాణించాడు. ఉమేశ్ యాదవ్ తో కలిసి కివీస్ టాపార్డర్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ అతికష్టం మీద 43.5 ఓవర్లాడి 190 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో (81 బంతుల్లో 85: 9 ఫోర్లు, 1 సిక్స్) ఛేజింగ్ లో తానేంత ప్రమాదకర ఆటగాడే మరోసారి నిరూపించుకున్నాడు. కివీస్ పై భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.