
కోహ్లీ హాఫ్ సెంచరీ.. భారత్ ఘనవిజయం
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ధర్మశాల: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్ల సమిష్టి రాణింపు, భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీ(81 బంతుల్లో 85: 9 ఫోర్లు, 1 సిక్స్) చేయడంతో సిరీస్ లో జట్టుకు విజయం దక్కింది. వన్డేల్లో కోహ్లీకిది 37వ అర్ధశతకం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 43.5 ఓవర్లాడి 190 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో బ్రాస్ వెల్, సోధీ, నీషమ్ చెరో వికెట్ తీశారు.
కోహ్లీతో పాటు జాదవ్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. లక్ష్యానికి భారత్ కొన్ని పరుగుల దూరంలో ఉండగా ధోనీ రనౌట్ అయి 4వ వికెట్ రూపంలో నిష్క్రమించాడు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు మంచి ఆరంభమే లభించింది. తొలి వికెట్ కు 9.2ఓవర్లలో రోహిత్ శర్మ(14), అజింక్యా రహానే(34 బంతుల్లో 33 పరుగులు: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి 49 పరుగులు జోడించారు. మనీష్ పాండే(17), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(21) పరుగులు చేశారు.
న్యూజిలాండ్ ను భారత బౌలర్లు తొలి ఓవర్ నుంచే కట్టడి చేశారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్(12)ను పాండ్యా తొలి వికెట్ గా వెనక్కి పంపగా అక్కడి నుంచి కివీస్ పతనం ఆరంభమైంది. మరో ఓపెనర్ లాథమ్(98 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) పోరాటానికి టీమ్ సౌథీ అద్భుత ఇన్నింగ్స్ తోడైంది. లేకపోతే ఓ దశలో 65/7 ఉన్న కివీస్ 100 పరుగులకే ఆలౌటయ్యేది. ఈ మ్యాచ్ లో 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సౌథీ (55; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రధాన ఆటగాళ్లలో టేలర్, రోంచీ డకౌట్ అయ్యారు. తొలి వన్డే ఆడుతున్న హార్దిక్ పాండ్యా 3/31 తో రాణించాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.