
టీమిండియాకు స్వల్ప లక్ష్యం
టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి రెట్టించిన ఉత్సాహంతో సుదీర్ఘమైన వన్డే సిరీస్ కు సిద్దమైన భారత జట్టు తొలి వన్డేలో సైతం ఆకట్టుకుంది.
ధర్మశాల: టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి రెట్టించిన ఉత్సాహంతో సుదీర్ఘమైన వన్డే సిరీస్ కు సిద్దమైన భారత జట్టు తొలి వన్డేలో సైతం ఆకట్టుకుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన న్యూజిలాండ్ ను చెల్లాచెదురు చేసి స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. తొలుత కివీస్ ఆటగాళ్లను క్రీజ్ లో కుదరుకోనీయకుండా చేసి వారి బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేసింది. అయితే టెయిలెండర్ల సాయంతో లాధమ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంతో న్యూజిలాండ్ 191 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ను ఆదిలోనే హార్దిక్ పాండ్యా చావు దెబ్బ కొట్టాడు. డాషింగ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(12) తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపి శుభారంభాన్నిచ్చాడు. అనంతరం ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(3) ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. ఇలా మొదలైన కివీస్ పతనం ఏడో వికెట్ వరకూ కొనసాగింది.
న్యూజిలాండ్ 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఓపెనర్ టామ్ లాధమ్(79 నాటౌట్;98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. కివీస్ వికెట్లు పడుతున్నా ఓపెనర్ గా వచ్చిన లాధమ్ మాత్రం పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఒకవైపు సహచర టాపార్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమైతే, లాధమ్ మాత్రం హాఫ్ సెంచరీ సాధించి జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. న్యూజిలాండ్ సాధించిన వంద పరుగుల్లో 50 పరుగులను లాధమ్ సాధించినవే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఎనిమిదో వికెట్ బ్రాస్ వెల్(15)తో కలిసి 41 పరుగులను జత చేయడంతో న్యూజిలాండ్ వంద పరుగుల మార్కును దాటింది. అనంతరం టిమ్ సౌతీతో కలిసి మరో 71 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే సౌతీ (55) వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అమిత్ మిశ్రాలు చెరో మూడు వికెట్లు సాధించగా, ఉమేష్ యాదవ్, కేదర్ జాదవ్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.