సాచిన్.. సాచిన్.. వాంఖడే స్టేడియం మార్మోగింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ వైదొలగి ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయింది. అయినా అభిమానుల హృదయాల్లో మాత్రం ఆ ముద్ర చెరిగిపోలేదు. గూగుల్ సరిగ్గా ఇదే అంశాన్ని పట్టుకుంది. తన వీడియో చానల్ యూట్యూబ్ ద్వారా సచిన్ టెండూల్కర్‌కు వినూత్న రీతిలో అభినందనలు తెలిపింది. #ThankYouSachin అనే పేరుతో ఉన్న ఈ ప్రకటన చూస్తే.. ఒక్కసారిగా హృదయాలు బరువెక్కక మానవు. సచిన్ టెండూల్కర్ ఆడిన మొట్టమొదటి మ్యాచ్‌తో వీడియో ప్రారంభం అవుతుంది. తర్వాత మాస్టర్ గురించి వివిధ వార్తాపత్రికల ప్రధాన శీర్షికలు కనిపిస్తాయి.
సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడంటూ వచ్చిన పత్రికా కథనం పట్టుకుని ఓ పెద్దాయన కళ్లలో నీళ్లు కక్కుకుంటుండగా పాట ప్రారంభం అవుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ మాస్టర్ బ్లాస్టర్ అంటే ఎంత అభిమానాన్ని తమ గుండెల్లో నింపుకొంటున్నారో ఈ పాట చూస్తే ఇట్టే అర్థమవుతుంది. భవన నిర్మాణ కార్మికుల నుంచి దుకాణదారుల వరకు అంతా ప్లకార్డులు పట్టుకుని సచిన్‌కు కృతజ్ఞతలు చెబుతుంటారు. బ్రాడ్‌మన్, వివియన్ రిచర్డ్స్, గవాస్కర్ లాంటి వాళ్లు సచిన్ గురించి చెప్పిన విషయాలను కూడా గుర్తుచేసిన ఈ వీడియో.. ఒక తరం ఎలా ముగిసిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.
సాధారణంగా ఏదైనా ప్రమోషన్ వీడియో అనగానే మోడళ్లు, సినిమా తారలు, క్రికెట్ ఆటగాళ్లు.. వీళ్లంతా ఉంటారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల అందరూ తమను తాము ఇందులో చూసుకోగలరు. క్రికెట్ ప్రేమికులందరికీ ఇది ఓ మంచి వరం అనడంలో సందేహం లేదు!!