
వెల్లింగ్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ పట్టు బిగించింది. గ్రాండ్‌హోమ్ (74 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో పాటు రాస్ టేలర్ (93; 10 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 313 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో ఓటమి తప్పించుకోవాలంటే కరీబియన్ జట్టు తీవ్రంగా పోరాడాల్సిందే. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ జీత్ రావల్ (42) వికెట్ త్వరగానే కోల్పోయింది.
ఆ తర్వాత రాస్ టేలర్‌తో జత కలిసిన నికోల్స్ (67) విండీస్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. గ్రాండ్‌హోమ్ క్రీజులోకి వచ్చాక ఆట స్వరూపమే మారింది. వచ్చీరాగానే టి20 తరహా ఇన్నింగ్స్ ఆడుతూ... 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది తొమ్మిదో వేగవంతమైన శతకం. ఆట ముగిసే సమయానికి బ్లండెల్ (57 బ్యాటింగ్, 6 ఫోర్లు)తో పాటు బౌల్ట్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో రోచ్ 3, కమిన్స్, చేజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment