
భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 294వ క్రికెటర్ శార్దుల్ ఠాకూర్... ప్రతీ క్రికెటర్ కలలు గనే రోజు ఆరేళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ తర్వాత అతనికి వచ్చింది... రవిశాస్త్రి చేతుల మీదుగా క్యాప్ గర్వంగా అందుకొన్న క్షణాన ఠాకూర్ మురిసిపోయి దానిపై ఉన్న లోగోను ముద్దాడాడు. కెప్టెన్ కోహ్లి అయితే చిన్నపిల్లాడిలా చప్పట్లు కొడుతూ తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. అయితే ఈ ఆనందం శార్దుల్‌కు పట్టుమని 10 బంతులే నిలిచింది. తన రెండో ఓవర్ నాలుగో బంతిని బౌల్ చేసిన అనంతరం ఒక్కసారిగా అతని తొడ కండరాలు పట్టేశాయి. మరో అడుగు కూడా వేయలేనన్నట్లుగా శార్దుల్ నొప్పితో బాధ పడ్డాడు. ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్ మైదానంలోకి వచ్చిన అతడిని పరిశీలించినా అప్పటికప్పుడు చికిత్సకు అవకాశం లేకపోయింది.
దాంతో కెప్టెన్ కోహ్లితో చర్చించిన అనంతరం శార్దుల్ మైదానం వీడాడు. ఆ తర్వాత శార్దుల్ తొడకు స్కానింగ్ జరిగిందని, తొలి రోజు మొత్తం మైదానంలో అడుగు పెట్టడని బీసీసీఐ ప్రకటించింది. పరిస్థితి చూసిన అనంతరం టెస్టులో కొనసాగే విషయంపై స్పష్టతనిస్తామని చెప్పింది. దురదృష్టవశాత్తూ 1.4 ఓవర్లకే అరంగేట్ర టెస్టులో శార్దుల్ బౌలింగ్ ముగియగా... భారత్ ఒక ప్రధాన పేసర్ లోటుతోనే ఆటను కొనసాగించాల్సి వచ్చింది. గత రెండేళ్లుగా భారత జట్టు ఆడిన ప్రతీ సిరీస్‌లో సభ్యుడిగా ఉంటూ వచ్చిన శార్దుల్‌కు ఇన్నాళ్ళకు అవకాశం దక్కింది. షమీ వరుసగా ఆరు టెస్టులు ఆడటంతో విశ్రాంతినిచ్చి అతడిని ఎంపిక చేశారు. ఆసియా కప్‌లో కూడా హాంకాంగ్‌తో మ్యాచ్ తర్వాత తొడ కండరాల గాయంతోనే శార్దుల్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.