
చెన్నైలో జడేజాలం
► భారత్ 4... ఇంగ్లండ్ 0
► ఏడు వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్
► చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం
► కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు
► వన్డే సిరీస్ జనవరి 15 నుంచి
చేతిలో 10 వికెట్లున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కుక్, రూట్, మొయిన్ అలీ, స్టోక్స్‌లాంటి హేమాహేమీలు ఒక రోజంతా ఆడలేరా? కచ్చితంగా మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందేమో! ఇదీ చెన్నై టెస్టులో చివరి రోజు సగటు క్రీడాభిమాని ఆలోచన. దీనికి తగ్గట్టుగానే లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రత్యర్థి జట్టుకు అసలు సిసలు సినిమా రవీంద్ర జడేజా చూపించాడు. ఒక్కొక్కరినీ తన స్పిన్ ఉచ్చులో బిగించి ఊపిరిసలపకుండా చేయడంతో కుక్ సేన పూర్తిగా గల్లంతయ్యింది. ఎంతలా అంటే ఓ దశలో 192/4తో ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నా 15 పరుగుల వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఘోరంగా ఓడింది. దీంతో భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను 4–0తో దక్కించుకోవడమే కాకుండా ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాదిని నంబర్‌వన్‌గా ముగించింది.
చెన్నై: విరాట్ కోహ్లి సేన ఈ ఏడాదిని మరో గొప్ప విజయంతో ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా అసమాన ఆటను ప్రదర్శించింది. సిరీస్‌ను 4–0తో సొంతం చేసుకుంది. మంగళవారం ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌పై భారత జట్టు ఓ సిరీస్‌ను 4–0తో నెగ్గడం ఇదే ప్రథమం. అజహరుద్దీన్ నేతృత్వంలోని భారత్ 1992–93లో ఇంగ్లండ్‌పై 3–0తో గెలువడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. నాలుగో రోజు కరుణ్ నాయర్ ‘ట్రిపుల్ సెంచరీ’తో డీలాపడిన ఇంగ్లండ్.. మంగళవారం రవీంద్ర జడేజా (7/48) గింగరాలు తిరిగే బంతులతో గజగజా వణికింది. ఫలితంగా ఒక దశలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... జడేజాలంలో చిక్కుకొని 104 పరుగుల తేడాలో మొత్తం 10 వికెట్లను కోల్పోయింది. 88 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓపెనర్లు కీటన్ జెన్నింగ్స్ (121 బంతుల్లో 54; 7 ఫోర్లు), కుక్ (134 బంతుల్లో 49; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు.
మొయిన్ అలీ (97 బంతుల్లో 44; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.టీ విరామం తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఏడుగురు బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన ఇంగ్లండ్ చివరికి ఇన్నింగ్స్ ఓటమిని పొందినట్టే.. వరుసగా మరో మ్యాచ్ కూడా అదే తరహాలో ముగించినట్టయ్యింది. ఇషాంత్, ఉమేశ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. మొత్తం ఈ మ్యాచ్‌లో జడేజా పది వికెట్లు తీయగా, అశ్విన్‌కు కేవలం ఒక వికెట్ మాత్రమే దక్కింది. కరుణ్ నాయర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. క్రిస్మస్ సెలవుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనున్న కుక్ బృందం జనవరిలో భారత్‌కు తిరిగి వస్తుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ జనవరి 15న మొదలవుతుంది.
అమోఘం... ఆ క్యాచ్: 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో వివియన్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ను అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ పట్టుకున్న తీరు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అచ్చం అదే తరహాలోనే రవీంద్ర జడేజా అద్భుత రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. ఇషాంత్‌శర్మ వేసిన ఇన్నింగ్స్ 53వ ఓవర్‌లో బెయిర్‌స్టో లెగ్‌సైడ్ ఆడిన బంతి గాల్లోకి లేచింది. డీప్ మిడ్ వికెట్‌లో జడేజా వెనక్కి పరిగెత్తుతూ తీసుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
సెషన్–1: ఓపెనర్ల నిలకడ
12 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా... మూడో ఓవర్‌లోనే కెప్టెన్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ను పార్థివ్ వదిలేశాడు. పిచ్ ఫ్లాట్‌గా ఉన్నా ఎలాంటి భారీ షాట్లకు పోకుండా కుక్, జెన్నింగ్స్ క్రీజులో నిలదొక్కుకోవడంపైనే దృష్టి పెట్టారు. అప్పుడప్పుడూ ఫోర్లు బాదినా కూడా తొలి సెషన్‌లో ఇద్దరూ పూర్తి రక్షణాత్మక ఆటతీరును ప్రదర్శించడంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. అటు పిచ్ కూడా బౌలర్లకు ఎలాంటి సహకారాన్ని అందించకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ లంచ్ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 32, పరుగులు: 85, వికెట్లు: 0
సెషన్–2: జడేజా షో
లంచ్ తర్వాత తొలి ఓవర్‌లోనే జడేజా బౌలింగ్‌లో కుక్ ఎల్బీ అవుట్ కోసం భారత్ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే తన మరుసటి ఓవర్‌లోనే జడేజా ఇంగ్లండ్ కెప్టెన్‌ను అవుట్ చేయగలిగాడు. ఈ సిరీస్‌లో కుక్‌ను అవుట్ చేయడం జడేజాకిది ఆరోసారి. దీంతో తొలి వికెట్‌కు 103 పరుగుల కీల క భాగస్వామ్యం ముగిసినట్టయ్యింది. ఇక్కడి నుంచి జడేజా షో ప్రారంభమైంది. కొద్దిసేపట్లోనే మరో ఓపెనర్ జెన్నింగ్స్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఇక స్వీప్ షాట్‌కు యత్నించిన స్టార్ బ్యాట్స్‌మన్ రూట్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. కోహ్లి రివ్యూకు వెళ్లడంతో జట్టుకు అనుకూల ఫలితం వచ్చింది. ఇక ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను జడేజా అందుకున్న తీరు అపూర్వం. టీ బ్రేక్‌కు ముం దు ఓవర్‌లో మొయిన్ అలీ రెండు ఫోర్లతో జోరు చూపించాడు. ఓవర్లు: 27, పరుగులు: 70, వికెట్లు: 4
సెషన్–3: పతనం పరిపూర్ణం
క్రీజులో ఫామ్‌లో ఉన్న మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ ఉండడంతో ఇంగ్లండ్ శిబిరంలో పెద్దగా ఆందోళన కనిపించలేదు. దీనికి అనుగుణంగానే వారు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే జడేజా మరోసారి తన స్పిన్ పవర్ చూపించి ఈ జోడిని విడదీశాడు. 72వ ఓవర్‌లో మొయిన్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను మిడాన్‌లో అశ్విన్ సులువుగా పట్టేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 63 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. తన తర్వాత ఓవర్‌లోనే స్టోక్స్ (54 బంతుల్లో 23; 4 ఫోర్లు)ను పెవిలియన్‌కు పంపగా డాసన్‌ను అమిత్ మిశ్రా బౌల్డ్ చేశాడు. రెండో కొత్త బంతిని తీసుకున్న వెంటనే ఉమేశ్‌యాదవ్ ఆదిల్ రషీద్ (2) వికెట్‌ను పడగొట్టాడు. ఇక చివరి రెండు వికెట్లను ఒకే ఓవర్‌లో జడేజా తీయడంతో భారత్ సంబరాల్లో మునిగింది. ఓవర్లు: 24, పరుగులు: 40, వికెట్లు: 6
ఓ జట్టుగా ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్, స్వదేశంలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో మాత్రమే మాకు నిరాశ ఎదురైంది. ఆసియా కప్, కివీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు అన్ని టెస్టు సిరీస్‌లను గెలిచాం. మున్ముందు మేం సాధించబోయే విజయాలకు ఇది పునాదిగా భావిస్తున్నాం. ఇక ఈ సిరీస్ విజయం సమష్టి ఫలితం. తొలి మ్యాచ్‌లో మేం ఒత్తిడికి లోనయినా మిగతా నాలుగు మ్యాచ్‌లను గెలవగలిగాం. 3–0తో ఇప్పటికే సిరీస్ నెగ్గినా చివరి మ్యాచ్‌లో మేం ఆడిన తీరు చూస్తే జట్టులో ఎంత కసి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ఒక దశలో ప్రతీ ఆటగాడు రాణించి విజయానికి కృషి చేశాడు. జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడం అభినందనీయం. – విరాట్ కోహ్లి
⇒ 4 తొలి ఇన్నింగ్స్‌లో 400 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోవడం ఇంగ్లండ్‌కిది నాలుగోసారి కావడం గమనార్హం. గతంలో పాకిస్తాన్ (2004లో భారత్ చేతిలో), శ్రీలంక (2011లో ఇంగ్లండ్ చేతిలో) ఈ విధంగా ఒక్కోసారి ఓటమి పాలయ్యాయి.
⇒ 5 భారత జట్టుకిది వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం. గతేడాది శ్రీలంకపై 2–1తో... ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై 3–0తో, వెస్టిండీస్‌పై 2–0తో, న్యూజిలాండ్‌పై 3–0తో, ఇంగ్లండ్‌పై 4–0తో భారత్ గెలిచింది.
⇒ 18 వరుసగా 18 టెస్టుల్లో భారత్‌కు ఓటమి లేకపోవడం ఇదే ప్రథమం. గతంలో (1985 నుంచి 1987 మధ్యకాలంలో) 17 టెస్టుల్లో భారత్ అజేయంగా నిలిచింది. తాజాగా కోహ్లి బృందం ఈ రికార్డును సవరించింది. ఓటమి లేకుండా వరుస టెస్టులు ఆడిన రికార్డు వెస్టిండీస్ (27 మ్యాచ్‌లు–1982 నుంచి 1984 మధ్యలో) పేరిట ఉంది.
⇒ 2 ఒక సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో నెగ్గడం భారత్‌కిది రెండోసారి. ఇంతకుముందు 2012–2013 సీజన్‌లో టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాను 4–0తో ఓడించింది.
⇒ 1 ఒకే టెస్టులో పది వికెట్లు తీయడం రవీంద్ర జడేజాకిది తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 48 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
⇒ 6 ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను జడేజా ఆరుసార్లు అవుట్ చేశాడు. ఒకే సిరీస్‌లో ప్రత్యర్థి జట్టు ఒకే బ్యాట్స్‌మన్‌ను అత్యధికంగా ఆరుసార్లు అవుట్ చేసిన ఏకైక భారత బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు.
⇒ 1 సునీల్ గావస్కర్ (1976 నుంచి 1980 మధ్యలో) తర్వాత విరాట్ కోహ్లి నాయకత్వంలో మాత్రమే వరుసగా 18 టెస్టుల్లో పరాజయం పొందకుండా అజేయంగా నిలిచింది.
⇒ 1 ఒకే టెస్టులో అర్ధ సెంచరీ చేసి, 10 వికెట్లు తీసి, నాలుగు క్యాచ్‌లు కూడా పట్టిన ఏకైక క్రికెటర్‌గా రవీంద్ర జడేజా గుర్తింపు పొందాడు. 1979–1980 సీజన్‌లో చెన్నైలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కపిల్ దేవ్ అర్ధ సెంచరీ చేయడంతోపాటు పది వికెట్లు తీశాడు.
⇒ 9 ఒకే ఏడాదిలో భారత్ అత్యధికంగా తొమ్మిది టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. 2010లో భారత్ అత్యధికంగా ఎనిమిది టెస్టుల్లో నెగ్గింది.
⇒ 1 ఒకే ఏడాదిలో 12 టెస్టులు ఆడి ఓటమి పొందని జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ (11 విజయాలు–2004లో), ఆస్ట్రేలియా (10 విజయాలు–2006లో) పేరిట ఉన్న ఘనతను భారత్ సవరించింది.
⇒ 25 ఓపెనింగ్ వికెట్‌కు 25 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి ఓపెనర్‌గా అలిస్టర్ కుక్ నిలిచాడు. గతంలో ఓపెనర్లు జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) అత్యధికంగా 24 సెంచరీ భాగస్వామ్యాల్లో పాలుపంచుకన్నారు.