
జడేజా రాకతో లయన్స్ గాడిలో పడేనా?
రాజ్‌కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పొందిన గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాకతోనైనా గాడిలో పడాలని భావిస్తోంది. గత సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఈ సీజన్‌ను మాత్రం ఓటమితోనే ప్రారంభించింది. కొల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో లయన్స్ ఘోర పరాభావంతో పాయింట్ల పట్టికలో చివరిస్ధానంలో నిలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో లయన్స్ ఓడిపోవడానికి బౌలింగ్ వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. లయన్స్‌పై కోల్‌కతా10 వికెట్ల తేడాతో, హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందాయి. శుక్రవారం రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లోనైనా లయన్స్ శుభారంభం ఇస్తుందో చూడాలి.
ఇక జట్టు కీలక ఆల్‌రౌండర్ జడేజా గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ చివరి టెస్టులో అతని వేలుకు గాయం అయింది. ఈ గాయంపై బీసీసీఐ వైద్యులు రెండు వారాల విశ్రాంతి తీసుకొమనడంతో ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. రేపటి మ్యాచ్‌తో జడేజా ఈ సీజన్‌లో పునరాగమనం చేస్తున్నాడు. జడ్డూ రాకతో లయన్స్ బౌలింగ్ పటిష్టం కానుంది. అటు బ్యాటింగ్‌తో డెత్ ఓవర్లను జడ్డూ హిట్టర్‌గా ఎదుర్కొనున్నాడు. జట్టు ప్రాక్టిస్‌లో పాల్గొన్న మరో ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.
బ్రెండన్ మెక్‌కల్లమ్, ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్, రైనా, దినేష్ కార్తీక్,లతో లయన్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో మెక్‌కల్లమ్, ఫించ్‌లు విఫలమవడం, రైనా కేవలం తొలి మ్యాచ్‌లో 68 పరుగులు చేసిన రెండో మ్యాచ్‌లో విఫలమవడం జట్టును కలవరపెడుతుంది. దినేష్ కార్తీక్ రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ భారాన్ని తన భూజాలపై వేసుకున్న జట్టుకు బౌలింగ్ వైఫల్యంతో పరాజయం తప్పలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో ప్రవీణ్‌కుమార్, శివిల్‌కౌశిక్, దావల్‌కులకర్ణి, బసిల్‌తంపి, తేజస్ బరోకాలు తమ స్ధాయికి తగ్గ బౌలింగ్ చేయకపోవడంతో లయన్స్‌కు ఓటమి తప్పలేదు. గత సీజన్‌లో రాణించిన దావల్‌కులకర్ణి ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. జడేజా రాకతో లయన్స్ బౌలింగ్ పటిష్ట అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోం గ్రౌండ్ అయిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని లయన్స్ యోచిస్తోంది.