బ్యాటింగ్ లో ఇరగదీశారు..!
ఢిల్లీ: అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఐపీఎల్-10లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ ఇరగదీసింది. ప్రత్యర్థికి 209 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్దేశించి తమ బ్యాటింగ్ బలాన్ని చూపెట్టింది. గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా(77;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు),దినేశ్ కార్తీక్(65; 34 బంతుల్లో 5ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడి భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మెకల్లమ్(1), డ్వేన్ స్మిత్(9)లు వెనువెంటనే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. గుజరాత్ స్కోరు 10 పరుగుల వద్ద వీరిద్దరూ అవుట్ కావడంతో ఆ జట్టుకు షాక్ తగిలింది. అయితే ఆ తరుణంలో గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా-మిడిల్ ఆర్డర్ ఆటగాడు దినేశ్ కార్తీక్లు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఒకవైపు ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూనే మరొకవైపు వికెట్లను కాపాడుకుంటూ స్కోరును ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో రైనా హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఆ తరువాత మరింత దాటిగా ఆడిన రైనా.. జట్టు స్కోరు 143 పరుగుల వద్ద రనౌట్ రూపంలో నిష్క్రమించాడు. దాంతో రైనా-దినేశ్ కార్తీక్ ల 133 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై స్వల్ప వ్యవధిలో అప్పటికే హాఫ్ సెంచరీని పూర్తి చేస్తుకున్న దినేశ్ కార్తీక్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ కు చేరాడు. కమిన్స్ బౌలింగ్ లో కోరీ అండర్సన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో కార్తీక్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.ఇక చివర్లో అరోన్ ఫించ్(27;19 బంతుల్లో 4 ఫోర్లు), రవీంద్ర జడేజా(18 నాటౌట్;7 బంతుల్లో 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.