టీమిండియా మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్(ఫైల్ ఫోటో)
బెంగళూరు : అఫ్గానిస్తాన్‌తో జరిగిన చారిత్రక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌డౌన్‌లో చతేశ్వర పుజారా బదులు కేఎల్ రాహుల్‌ను పంపడంపై టీమిండియా మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ తప్పుబట్టారు. టెస్టుల్లో మూడు, నాలుగు బ్యాటింగ్ స్థానాలు ఎంతో కీలకమైనవని, వాటిపై ఎప్పుడూ ప్రయోగాలు చేయకూడదని సూచించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని టెస్టు సిరీస్‌లలోనూ మూడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా పుజారా అద్భుతంగా రాణిస్తున్నాడని, జులైలో కీలక ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం టీమిండియాకు మంచిది కాదన్నారు.
అఫ్గాన్ టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడి ఉంటే పుజారాను మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపించే వారు కదా అని ప్రశ్నించారు. ఇక పరుగుల చేయడానికి ఆపసోపాలు పడుతున్న అజింక్యా రహానే తప్పుకొని రాహుల్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. కేఎల్ రాహుల్ ఆటలో ఎంతో పరిణితి చెందాడని, అతనికి వరసగా అవకాశాలు కల్పిస్తే ఇంకాస్త మెరుగ్గా రాణిస్తాడని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment