ఆఫ్ఘనిస్తాన్ యువ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ టీమిండియా మిడిలార్డర్ స్టార్ కేఎల్ రాహుల్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒమర్‌జాయ్ ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతుంది. రాహుల్‌లాగే వన్డేల్లో ఐదో స్థానంలో బరిలోకి దిగే ఒమర్‌జాయ్.. ఇంచుమించు అతనిలాగే పరుగులు సాధిస్తున్నాడు.
గత కొంతకాలంగా ఈ ఇద్దరు వన్డేల్లో కీలకమైన ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ జట్టుకు ఉపయోగపడే కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఇటీవలికాలంలో మిడిలార్డర్‌లో చూసిన బెస్ట్ బ్యాటర్లు వీరేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా అవసరమైతే బ్యాట్‌ను ఝులిపించగల సమర్దులు కూడా.
గత కొన్ని ఇన్నింగ్స్‌ల్లో వీరి బ్యాటింగ్ శైలే ఇందుకు నిదర్శనం. వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ చేసిన మెరుపు సెంచరీ.. కొద్ది రోజుల కిందట శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఒమర్‌జాయ్ చేసిన విధ్వంసకర శతకం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
రాహుల్ విషయానికొస్తే.. అతను ఈ ఏడాది ఇంకా వన్డేల్లో బరిలోకి దిగలేదు. గతేడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటనలో ఆడిన మ్యాచ్‌లే రాహుల్‌కు వన్డేల్లో చివరివి.
ఒమర్‌జయ్ విషయానికొస్తే.. ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఈ ఏడాది ఇప్పటికే తన మార్కును చూపించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇతను చెలరేగిపోతున్నాడు.
ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో 115 బంతుల్లో 149 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఒమర్‌జాయ్.. ఇవాళ జరుగుతున్న మూడో మ్యాచ్‌లో అర్దసెంచరీతో (54) రాణించాడు.
ఈ మ్యాచ్‌లో ఒమర్‌జాయ్.. రహ్మత్ షాతో (65) కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ కష్టాల్లో పడేది. ఒమర్‌జాయ్, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్ (48), ఇక్రమ్ (32) రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 48.2 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బౌలర్లలో మధుషన్ 3, అషిత ఫెర్నాండో, దునిత్ వెల్లలగే, అఖిల ధనంజయ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది.
- గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ స్కోర్లు.. 21, 56, 66, 39, 102, 8, 21, 39, 27
- గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఒమర్‌జాయ్ స్కోర్లు.. 54, 3, 149 నాటౌట్, 97 నాటౌట్, 22, 31 నాటౌట్, 73 నాటౌట్, 27, 19, 62
పై గణాంకాలు చూస్తే రాహుల్ కంటే ఒమర్‌జాయ్ ఇంకా మెరుగ్గా కనిపిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment