రోస్‌బర్గ్ బోణీ
► ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
► హామిల్టన్‌కు రెండో స్థానం
మెల్‌బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్‌లోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే దక్కాయి. ఆదివారం జరిగిన ఈ రేసులో నికో రోస్‌బర్గ్ విజేతగా నిలువగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 48 నిమిషాల 15.565 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ గంటా 48 నిమిషాల 23.625 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ 23వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రోస్‌బర్గ్‌కు 25 పాయింట్లు లభించాయి.
18 నెలల తర్వాత హామిల్టన్‌ను కాదని మరో డ్రైవర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి రావడం ఇదే తొలిసారి. ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని పొందగా... మరో డ్రైవర్ పెరెజ్ 13వ స్థానంలో నిలిచాడు. ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 3న జరుగుతుంది.