హర్భజన్ వర్సెస్ అంబటి రాయుడు!
పుణె: ఏ తరహా గేమ్లోనైనా మాటల యుద్ధం అనేది సర్వ సాధారణం. క్రికెట్ లో అయితే మోతాదుకు మించే ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇది కేవలం ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే ఒకే జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరగడమనేది చాలా అరుదు. ఇదే తరహా ఘటన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో ఎడిషన్ లో చోటు చోటుచేసుకుంది. ఆదివారం పుణెతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లైన హర్భజన్ సింగ్, అంబటి రాయుడులు కొంత ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పుణె బ్యాటింగ్ చేసే క్రమంలో పదకొండో ఓవర్ ను హర్భజన్ వేయగా, రాయుడు మిస్ ఫీల్డ్ చేయడమే ఇందుకు కారణం.
హర్భజన్ వేసిన ఆ ఓవర్ నాల్గో బంతిని పుణె ఆటగాడు సౌరభ్ తివారీ డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫోర్ సాధించాడు. అయితే ఆ బంతిని ఆపే క్రమంలో రాయుడు పరుగెత్తినా అది కాస్తా బౌండరీ దాటింది. దీంతో హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా బంతిని కళ్లతో చూసి పరుగెత్తు అంటూ సైగ చేస్తూ అరిచాడు. హర్భజన్ అలా అనడంతో చిర్రెత్తుకొచ్చిన రాయుడు అంతే దీటుగా స్పందించాడు. అయితే ఏంటి అన్న రీతిలో రాయుడు తిరిగి సమాధానమిచ్చాడు. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న హర్భజన్.. రాయుడ్ని సముదాయించే యత్నం చేశాడు. అయితే తనకు ఏమీ చెప్పవద్దు అనే రీతిలో హర్భజన్ ఎక్స్క్యూజ్ను రాయుడు పక్కకు పెట్టడం కొసమెరుపు.