
రియో ఒలింపిక్స్‌కు హర్‌దీప్ అర్హత
ఆసియా క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీ
ఆస్తానా (కజకిస్తాన్): అందర్నీ ఆశ్చరపరుస్తూ భారత గ్రీకో రోమన్ రెజ్లర్ హర్‌దీప్ సింగ్ రియో ఒలింపిక్స్‌కు మరో బెర్త్‌ను ఖాయం చేశాడు. ఫ్రీస్టయిల్ విభాగంలో నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత పొందగా... తాజాగా వీరిద్దరి సరసన హర్‌దీప్ చేరాడు. ఆదివారం ముగిసిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో హర్‌దీప్ 98 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ముకేశ్ ఖత్రీ (55 కేజీలు) తర్వాత గ్రీకో రోమన్ విభాగంలో ఓ భారత రెజ్లర్ ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ఇదే ప్రథమం. నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో పోటీపడిన హర్‌దీప్ 11-0తో సపర్‌మమెదోవ్ (తుర్క్‌మెనిస్తాన్)పై, సెమీఫైనల్లో 11-2తో అసెమ్‌బెకోవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. ఫైనల్లో హర్‌దీప్ బరిలోకి దిగలేదు. దాంతో రజతం దక్కింది.