అచ్చం ధోనీలా హెలికాఫ్టర్ షాట్!
ఓవల్: చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా సత్తాచాటింది. అయితే నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 240 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ధనా ధన్ ఇన్నింగ్స్‌కు అందరూ దాసోహమయ్యారు. కేవలం 54 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఎంపిక సరైనదేనని నిరూపించాడు. అయితే పాండ్యా సిక్సర్లు కొట్టిన తీరు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని గుర్తుకు తెప్పించిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ ఇన్నింగ్స్ చివరి బంతిని హార్దిక్ అద్బుతమైన సిక్సర్‌గా మలిచాడు. రుబెల్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ధోనీ తరహాలో హెలికాఫ్టర్ షాట్ ఆడాడని పాండ్యాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. మాపై ఏ ఒత్తిడి లేదు. అత్యుత్తమ క్రికెట్‌ను ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 23.5 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలడంతో 240 పరుగుల భారీ విజయం దక్కింది. భువనేశ్వర్ (3/13), ఉమేశ్ (3/16) లతో పాటు బ్యాటింగ్‌లో దినేశ్ కార్తీక్ (94 రిటైర్డ్ అవుట్), శిఖర్ ధావన్ (60) రాణించారు.