'జిమ్నాస్టిక్స్ అంటే సర్కస్ ఫీట్లా అని అడిగారు'
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఒలింపిక్స్కు అర్హత సాధించి తొలి మహిళా జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్కు రియోలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయట. రియోకు వచ్చిన అభిమానుల్లో కొంతమంది జిమ్నాస్టిక్స్ గేమ్స్ను సర్కస్ ఫీట్లతో పోల్చడమే కాకుండా, తనను పదే పదే అవే ప్రశ్నలతో సతమతం చేశారని దీపా కర్మాకర్ తాజాగా స్పష్టం చేసింది.
'నేను రియోలో పతకం సాధించాలనే ఒత్తిడిలో ఉన్నప్పుడు పలువురు నా వద్దకు వచ్చి జిమ్నాస్టిక్స్ అంటే ఏమిటని అడిగారు. అలా అడగమే కాకుండా సర్కస్ను పోలి ఉంటుందా అని అడిగారు. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోకుండా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించా' అని వాల్ట్ విభాగంలో నాల్గోస్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన దీపా పేర్కొంది. ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో రియో జ్ఞాపకాల్ని నెమరవేసుకున్న త్రిపుర అమ్మాయి.. జిమ్నాస్టిక్స్ను సర్కస్ తో పోల్చడం కొంతవరకూ ఇబ్బందికరంగా అనిపించిందని పేర్కొంది.