
హసీన్ జహాన్, మహ్మద్ షమీ
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కారు ప్రమాదంలో స్పల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. పరామర్శించడానికి వెళ్లిన తనని షమీ దగ్గరకు రానివ్వలేదని అతని భార్య హసీన్ జహాన్ బుధవారం మీడియాకు తెలిపారు.
‘షమీ గాయపడ్డాడని అతన్ని చూసేందుకు వచ్చా. కానీ కలిసేందుకు అతను నిరాకరించాడు. షమీ ప్రమాదంలో గాయపడ్డాడని తెలిసిప్పటి నుంచి తన కూతురు తండ్రి ఫొటోలు చూపిస్తూ నాన్న కావాలని ఏడ్చింది. వెంటనే నేను షమీని కలవడానికి వచ్చా. అంతకు ముందు అతనితో ఫోన్‌లో కూడా మాట్లాడాను. కానీ మా మధ్య సయోధ్య గురించి నేను అతన్నేం అడగలేదు.’ అని హసీన్ జహాన్ తెలిపారు.
షమీకి చెడు జరగాలని తానెప్పుడూ కోరుకోలేదని, అతను తనకు శత్రువేమి కాదని, గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు ఆమె మంగళవారం మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా షమీ ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో షమీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇక షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, తనను తీవ్రంగా వేధించాడని హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సైతం పాల్పడ్డాడని ఆరోపణలు చేయడంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో షమీకి క్లీన్ చీట్ రావడంతో వార్షిక వేతన కాంట్రాక్టు పునరుద్దరించడంతో పాటు అతనికి ఐపీఎల్ ఆడే మార్గం సుగుమమైంది.